TDP@40: టీడీపీలో 40శాతం యూత్ కోటా
తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అధిగమించి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడిపించామని చెప్పారు.
- By CS Rao Published Date - 01:31 AM, Wed - 30 March 22

తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అధిగమించి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడిపించామని చెప్పారు. మరో 40 ఏళ్లు టిడిపి విజయవంతంగా ముందుకు సాగాలని, అందుకోసం యువత ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికలలో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు.
తెలుగుజాతి ధృవతార ఎన్టీరామారావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు హైదరాబాద్ ఆదర్శనగర్ న్యూఎమ్మెల్యే క్వార్టర్సులో టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలంగాణ, ఏపీ టిడిపి అధ్యక్షులు బక్కని నరిసింహులు, కింజరాపు అచ్చెన్నాయుడులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని టిడిపి 40వ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ స్థాయి నుండి ఒక పండుగగా జరుపుకోవడాన్ని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా 400 దేశాలలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం తెలుగువాడి సత్తాను చాటి చెబుతుందన్నారు. అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ టిడిపిని పెట్టలేదని, తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పార్టీని పెట్టారని గుర్తు చేశారు. తెలుగుజాతి ప్రపంచంలో ఏ చోట ఉన్నా వారి సంక్షేమమే ధ్యేయంగా గత 40 ఏళ్లుగా టిడిపి పని చేస్తుందని తెలిపారు.
40 సంవత్సరాలలో 21 ఏళ్లు అధికారంలో, 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టిడిపిది ఎప్పుడూ ప్రజాపక్షమే అని చెప్పారు. తెలంగాణలో పటేల్-పట్వారీ, ఏపీలో మునసబు-కరణాలు పేదల రక్తం తాగుతుంటే ఒక్క కలంపోటుతో ఆ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీరామారావుదని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనదేనని, ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం విద్యుత్ మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్ళు తగిలిస్తున్నారని విమర్శించారు. బిసిలకు రిజర్వేషన్లు, ఆడబడుచులకు ఆస్థిహక్కు ఎన్టీఆర్ ఇచ్చినవేనని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు తాను ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ నేడు దేశదేశాల్లో ఐటి ఉద్యోగులుగా తెలుగువారికి అవకాశాలిచ్చిందని చెప్పారు. హైదరాబాదులో ఐ.ఎస్.బి ఏర్పాటుకు తాను చేసిన కృషిని ఆయన వివరించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలలో ఐ.ఎస్.బి ఏర్పాటుకు పరిశీలన జరిపిన కమిటీ తన కృషి మేరకు హైదరాబాద్ వచ్చిందని చెప్పారు. తాను ప్రారంభించిన జినోమ్ వ్యాలీలో కరోనా వాక్సిన్ తయారైందంటే టిడిపి దూరదృష్టి స్పష్టమవుతుందని అన్నారు. రాజకీయ నాయకులనే కలవననే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన ప్రజంటేషన్ కు ఆకర్షితుడై, హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇప్పుడు ఒక తెలుగువాడు సిఇఓ అవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు కోసం వాజపాయ్ పై వత్తిడి తెచ్చానని చెప్పారు తాను విజన్ 2020 తెస్తే కొంత మంది 420లు ఎద్దేవా చేశారని, కానీ ఆ ఫలాలు ఇప్పుడు హైదరాబాదులో ఏ విధంగా అందుతున్నాయో అందరూ చూస్తున్నామని అన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించానని చెప్పారు. అయితే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంటే ఏపీ తిరోగమనంలో ఉందన్నారు. తన పిలుపునకు స్పందించి అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. 1996కు ముందు ఎకరం రూ. 60 వేలు పలికిన కోకాపేట భూములు టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మూలంగా రూ.60 కోట్లు పలికాయని గుర్తు చేశారు. అదే రీతిలో అమరావతి అభివృద్ధి చెందుతుంటే సైకో ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వ్యవస్థలు కుప్పకూలాయని, టిడిపి కార్యాలయం పైనా, అమరావతిలో తన నివాసం పైనా దాడులు చేశారని ఆయన చెప్పారు. అయినప్పటికీ బెదిరేది లేదని అన్నారు.
లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలకు బీమా సదుపాయం తెచ్చామని, రూ 100 కోట్ల పైబడి కార్యకర్తలకు బీమా అందిందని గుర్తు చేశారు. ఇప్పుడు టిడిపి సభ్యత్వ నమోదు జరుగుతుందని, అందరూ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. టిడిపి కార్యకర్తలకు బీమా సదుపాయంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు, ఆర్ధిక స్వావలంబనకు ప్రణాళికలు రచిస్తానని చెప్పారు. 70 లక్షల మంది కార్యకర్తల సైన్యం తెలుగుదేశం సొంతమని చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వంతో పాటు ఆన్ లైన్ డొనేషన్స్ కూడా ప్రోత్సహించాలని యువతకు ఆయన సూచించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపి, పేదరికం లేని సమాజ నిర్మాణానికి టిడిపి పని చేస్తుందని ఆయన చెప్పారు.
రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి టిడిపి హయాంలోనే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు ఎన్టీఆర్ తెలుగుగంగ, హంద్రీనీవా పథకాలతో రాయలసీమకు నీళ్ళిచ్చారని, కృష్ణా జలాలలో ఏపీకి వాటా సాధించారని చెప్పారు. తాను కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి శ్రమించానని, పట్టిసీమ పూర్తి చేసి కృష్ణ, గుంటూరు జిల్లాలకు సాగు, తాగునీటి కొరత తీర్చామని చెప్పారు.
ఎన్టీఆర్ గురుకుల పాఠశాలల వ్యవస్థకు శ్రీకారం చుడితే తన హయాంలో ఐఐటిల అభివృద్ధికి కృషి చేశానని ఆయన వివరించారు. ఐఐటి, బిట్స్ పిలానీలలో తెలుగు విద్యార్థులు అధిక సీట్లు సాధించేలా ప్రోత్సహించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి టిడిపి అజెండా అని చెప్పారు. ‘సమాజమే దేవాలయం.. పేదవాళ్ళే నా దేవుళ్ళు.. ‘ అని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో టిడిపి ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీగా టిడిపి ఆవిర్భవించినా జాతీయ స్ఫూర్తితో పని చేశామని, జాతీయ రాజకీయాలను శాసించామని చంద్రబాబు చెప్పారు. కె.ఆర్. నారాయణన్ రాష్ట్రపతిగా, బాలయోగిని లోకసభ స్పీకరుగా చేసి దళితులకు గౌరవమిచ్చింది టిడిపి అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందించిన సేవలను వివరించారు.
బసవతారకం కేన్సర్ ఆసుపత్రి సేవలను గుర్తు చేశారు. తాను స్థాపించిన బసవతారకం ట్రస్టు కేన్సర్ ఆసుపత్రిని ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఛైర్మనుగా ముందుకు నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. అవినీతిరహిత పాలన జరిగే సింగపూర్ సహకారంతో అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తే అటువంటి దేశంపై అవినీతి ముద్ర వేసి వెనక్కు పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రశంసల కోసమో తాను అభివృద్ధి చేయలేదని, ప్రజల కోసం చేశానని చెప్పారు. సంపద సృష్టించాలని, అందుకు అభివృద్ధి ఆలంబన కావాలని, అప్పుడే పేదరికం తగ్గుతుందని ఆయన అన్నారు. మట్టిలో మాణిక్యాలను సానబెడితే కూలీల పిల్లలు సైతం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు.
ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావంతో బిసిలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కిందని అన్నారు. ఏపీలో ప్రస్తుతం జగన్ పాలన అరాచకంగా మారిందని ఆరోపించారు. 1982లో కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేందుకు ఎన్టీఆర్ చైతన్యరథం ఎక్కి ఏ విధంగా జనాదరణ పొందారో, అదే విధంగా ఇప్పుడు జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు చంద్రబాబు మరోసారి ప్రజా క్షేత్రంలోకి రానున్నారని చెప్పారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి ఆవిర్భవించిందని అన్నారు. పటేల్- పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదల బతుకుల్లో ఎన్టీఆర్ వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు, లోకేష్ కంకణబద్ధులై పని చేస్తున్నారని అభినందించారు.
తెలంగాణలో కెసిఆర్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని విమర్శించారు. తెలంగాణలో బలమైన కార్యకర్తల శక్తి తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉందని, మళ్ళీ తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం ఖాయమని చెప్పారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టిడి జనార్దన్, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవిందకుమార్ గౌడ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కొత్తకోట దయాకరరెడ్డి, గౌనివాని శ్రీనివాసులు, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, ఎన్ఎండి ఫరూక్, పితాని సత్యనారాయణ, పరసా రత్నం, తెలంగాణ టిడిపి ఇంఛార్జి కంభంపాటి రామమోహనరావు, తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, తెలంగాణ తెలుగుయువత అధ్యక్షులు పొగాకు జయరాం చందర్, ఏపీ తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలంగాణ తెలుగుమహిళ అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, ఏపీ టిడిపి ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం….ఒక రాజకీయ అనివార్యం.(1/5)#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay pic.twitter.com/0sAB67xDL2
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2022