TDP vs YSCP : మావిగన్ జగన్కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
- Author : Prasad
Date : 03-06-2026 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి అభివృద్ధిపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ నిబంధనల ప్రకారం ప్లాట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి పనులు టెండర్ల ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రైతుల నుంచి ఎక్కడా బలవంతంగా భూములు తీసుకోలేదని పేర్కొన్నారు. ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని.. బయటకు వచ్చి ప్రాజెక్టులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో తొలి దశ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కొండవీటి వాగు, పాలవాగు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలోని 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రాబోయే నాలుగు నెలలు వర్షాకాలం ఉండటంతో ముందస్తు ప్రణాళికతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.