Chalo Vijayawada : మరో `చలో విజయవాడ`కు సామాజిక టచ్
విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నిరసన దీక్షకు దిగాడు.
- By CS Rao Published Date - 05:46 PM, Wed - 9 February 22

విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నిరసన దీక్షకు దిగాడు. ఆ దీక్షకు రంగా-రాధ మిత్ర మండలి మద్ధతును కూడగట్టుకున్నాడు. తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన చేస్తోన్న డిమాండ్. ఇది ఆయన వ్యక్తిగతం అనుకోవడానికి లేదు. పార్టీ పరంగా చేస్తోన్న నిరసన దీక్షగానే భావించాలి. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఉమ దీక్షకు మద్ధతు ప్రకటించకపోయినప్పటికీ, పరోక్షంగా మద్ధతు ఉండే ఉంటుంది. లేదంటే జిల్లాల పెంపును ప్రకటించిన వారం తరువాత ఆయన నిరసనదీక్షకు దిగే ఛాన్స్ లేదు. పైగా విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై చంద్రబాబు మౌనంగా ఉన్నాడు.వాస్తవంగా 2019 ఎన్నికల ప్రచారం సమయంలోనేయ ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాకు ప్రకటిస్తానని చెప్పాడు. ఆ మేరకు రెండేళ్లుగా కసరత్తు జరిగింది. వారం క్రితం కొత్త జిల్లాల జీవోలను జగన్ సర్కార్ వెల్లడించింది. దానిపై వైసీపీలోని పలువురు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజనపై అసంతృప్తిగా ఉన్నారు. ఆ మేరకు నిరసనలు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జిల్లాల పెంపులోని అవకతవకలపై ఆందోళనలు చేస్తోంది. అయితే, విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని రాజకీయ అస్త్రంగా రెండు పార్టీలు తీసుకున్నాయి. దీంతో వ్యూహాత్మక మౌనాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు.
తెలుగుదేశం పార్టీలోని కీలక లీడర్, లోకేష్ కోటరీలోని మనిషిగా పేరున్న బోండా ఉమ జిల్లాల పెంపు, పేర్లపై నిరసన దీక్షకు దిగడం కొత్త సామాజిక రాజకీయ సమీకణాలకు దారితీస్తోంది. కమ్మ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్ధతు ఇస్తుందని ఆ పార్టీ వేస్తోన్న అంచనా. అందుకే, కృష్ణా జిల్లాలోని కాపులను తమ వైపు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ బాబు వేశాడని తెలుస్తోంది. ఆ క్రమంలోనే బోండా ఉమ నిరసన దీక్ష అంటూ వైసీపీ భావిస్తోంది. ఎన్టీఆర్ జన్మించిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మచిలీపట్నం లోక్ సభలో ఉంది. అందుకే, మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని బోండా ఉమ డిమాండ్. అలాగే, విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని సూచిస్తున్నాడు. ఇదే డిమాండ్ ను భవిష్యత్ లో పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి టీడీపీ పరోక్షంగా గేమ్ మొదలు పెట్టిందని ఆ పార్టీలోని ఒక గ్రూప్ భావిస్తోంది.
రంగా అభిమానులను కించ పరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని సామాజిక కోణాన్ని టీడీపీ లీడర్ బోండా తెరమీదకు తీసుకొస్తున్నాడు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రణాళికను వెల్లడించాడు. సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని బోండా హెచ్చరించాడు. నిరసన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, బాల, కాపు సంఘం నేత బేతిన రాము హాజరయ్యారు. అంటే, రాబోవు రోజుల్లో కాపు సామాజిక వర్గం నేతలను ముందుపెట్టి టీడీపీ ఒక పెద్ద సామాజిక ఉద్యమాన్ని విజయవాడ కేంద్రంగా తీసుకురాబోతుందని వైసీపీ అంచనా వేస్తోంది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడ వెనుక చంద్రబాబు ఉన్నాడని వైసీపీ చెబుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా కొందరు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. అదే తరహాలో ఇప్పుడు కాపు సామాజిక నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలని బాబు ప్లాన్ చేస్తున్నాడని జగన్ సర్కార్ అనుమానిస్తోంది. అందుకే, ముందస్తు ప్రతి వ్యూహాలను రచిస్తోంది. రెండు సామాజిక వర్గాల పోరు మాదిరిగా జిల్లాల పేర్లను తీసుకొస్తోన్న క్రమంలో రాబోవు రోజుల్లో దీనికి ఎలాంటి ఎండింగ్ జగన్ ఇస్తాడో..చూడాలి!