TDP- JSP- BJP: మే నుండి చంద్రబాబు సర్కార్ సూపర్ సర్కార్… తల్లికి వందనం ప్లస్ మరో రెండు పథకాలు…!!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో కష్టపడి ముందుకుసాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు.
- By Kode Mohan Sai Published Date - 03:55 PM, Wed - 26 February 25

TDP- JSP- BJP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో కష్టపడి ముందుకుసాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు. NDA ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు, సూపర్ సిక్స్‌లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. మే నెలలోనే తల్లికి వందనం ఇవ్వబోతున్నామని, అన్నదాత సుఖీభవతో పాటు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్యం ఎప్పటికో కాదని..ఆ విజన్ అమలుచేస్తూ ఇప్పటి నుంచే ఫలితాలు సాధించడం మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు బాగుంది. రూ.18,401 కోట్ల అదనపు సంపద వచ్చే అవకాశముందన్నారు.
హామీల అమలుకు షెడ్యూలు ప్రకటించారు చంద్రబాబు
– వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి DSC ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ
– మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ. చదువుకునే పిల్లలు ఎందరున్నా, అందరికీ ఆర్థికసాయం
– అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తాం. కేంద్రమిచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు
– మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే రూ.20 వేల చొప్పున ఇస్తాం.
– త్వరలో నిరుద్యోగ భృతి రూ.3,000
– ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యే సందర్భంగా జూన్ 12న పేదలకు 5 లక్షల ఇళ్లు పంపిణీ
నెరవేర్చిన హామీలు ఇవి
– వృద్ధాప్య పింఛన్లు రూ.3,000 నుంచి ఒకేసారి రూ.4,000కు పెంపు. దివ్యాంగులకు 6,000, లెప్రసీ, డయలాసిస్ రోగులకు రూ.10 వేలు, మంచం దిగలేని వారికి రూ.15 వేల పింఛన్
– ఏటా 64 లక్షల మందికి సామాజిక పింఛన్ల రూపేణా రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.
– ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం
– 204 అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం.
– దీపం కింద ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్న హామీ మేరకు ఇప్పటికే ఒకటి ఇవ్వగా, మిగిలినవి ఇస్తాం. దీనిపై రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ పథకం కింద కోటి కుటుంబాలు రిజిస్టర్ చేసుకోగా, 93 లక్షల మందికి అమలు చేశాం.
డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేలు
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నందున ఉత్పత్తి విలువలో అదనపు ప్రయోజనం సాధించామన్నారు చంద్రబాబు. 2023-24లో రాష్ట్రంలో వృద్ధిరేటు 8.6% ఉండగా, ఈ ఏడాది 12.94%గా ఉండబోతోందన్నారు. ఫలితంగా రూ.62 వేల కోట్లు అదనపు సంపద వస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగా 8.6% వృద్ధి మాత్రమే ఉంటే రూ.15.44 లక్షల కోట్ల ఉత్పత్తి వచ్చేదన్నారు. వృద్ధి పెరిగి రూ.16.06 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించామని వివరించారు. అసాధ్యమనుకున్న నాలుగైదు ముఖ్య పనులను ఎన్డీయే ప్రభుత్వం 8 నెలల్లోనే సుసాధ్యం చేసిందన్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చామన్నారు.
ఇక మిర్చి క్వింటాలుకు రూ.11,750 చొప్పున ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తోందన్నారు. మార్కెట్ జోక్యం వల్ల ఏపీ రైతులకు మేలు జరిగేలా కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు చంద్రబాబు. రైతు వారీగా పండించే ఈ-పంట ఆధారంగా చేసుకుని సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. రైతుల కోసం రూ.100 కోట్లతో నిధి పెడుతామన్నారు.