TDP : చంద్రబాబు వద్ద రాబిన్ గుట్టు!సర్వేలపై సీనియర్ల గుర్రు!!
నేల విడిచి సాము చేయొద్దని పెద్దల సామెత. సరిగ్గా ఈ సామెత తెలుగుదేశం పార్టీలోని తాజా పరిస్థితికి సరితూగుతోంది.
- By CS Rao Published Date - 02:49 PM, Thu - 24 November 22

నేల విడిచి సాము చేయొద్దని పెద్దల సామెత. సరిగ్గా ఈ సామెత తెలుగుదేశం పార్టీలోని తాజా పరిస్థితికి సరితూగుతోంది. ఎందుకంటే బూత్ కమిటీ నిర్మాణం లేకుండా ఎన్నికల దిశగా అడుగు వేస్తోంది. ఆ విషయాన్ని రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు చేరవేశారట. దీంతో నియోజకవర్గాల ఇంచార్జిల మీద ఆయన ఫైర్ అయ్యారని తెలుస్తోంది. లోకేష్ పాదయాత్ర సమయానికి బూత్ కమిటీలు 100శాతం పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టారని పార్టీ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఇప్పటికీ 80 చోట్ల బూత్ కమిటీలు లేవని రాబిన్ సింగ్ ఇచ్చిన నివేదికలోని సారాంశమట. దాన్ని గమనించిన చంద్రబాబు సీనియర్లతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అంతేకాదు, రాబిన్ సింగ్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశించారని సమాచారం. దీంతో సీనియర్లు నొచ్చుకుంటున్నారని ఆ పార్టీలోని టాక్. బహుశా అందుకే, గత వారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే ప్రకారం ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకుని, గెలిచే అవకాశం ఉన్న వాళ్లకే టిక్కెట్ ఇవ్వండని ఓపెన్ గా ఆయన చెప్పేశారు. నాతో సహా ఎవరైనా సరే మొహమాటం లేకుండా నిర్ణయం తీసుకోండని అయన్నపాత్రుడు చెప్పడం వెనుక రాబిన్ సింగ్ నివేదిక సారాంశం ఉందని ఆలస్యంగా వెలుగుచూస్తోంది.
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి `మినీ మహానాడులు, బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ..` తదితర కార్యక్రమాలను రాబిన్ సింగ్ డిజైన్ చేశారట. వాటిని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లలేక పోయిన లీడర్ల జాబితా చాలా పెద్దగా ఉందని తెలుస్తోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాల్గొన్న సమావేశాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిలు 50శాతానికి పైగా `అప్ టూ మార్క్` పనిచేయడంలేదని రాబిన్ సింగ్ తేల్చేశారని పార్టీలోని కోర్ టీమ్ చర్చించుకుంటోంది. ఎక్కువగా సీనియర్లు ఇంచార్జిలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందారని సింగ్ ఇచ్చిన నివేదిక సారాంశమని వినికిడి. ఫలితంగా సీనియర్లకు కొందరికి చంద్రబాబు ఫోన్ ద్వారా క్లాస్ పీకారట. దీంతో రాబిన్ సింగ్ సర్వేల మీద సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధం అయ్యారని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోన్న మాట.
బూత్ కమిటీలు లేకుండా ఎన్నికలు ఎలా చేద్దామనుకుంటున్నారు? అంటూ నేరుగా చంద్రబాబు సీనియర్లను ప్రశ్నించారట. ఇప్పటికైనా గ్రామ స్థాయిలో బూత్ కమిటీలను వేయలేకపోతే తప్పుకోవాలని సున్నితంగా మందలిస్తూ చివరి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఒక వేళ అనుకున్న విధంగా పనిచేయలేని పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జిలను ప్రకటించాలని రాబిన్ సింగ్ సూచించారట. అలా జరిగితే, ఒంటరిగా పార్టీ అధికారంలోకి వస్తుందని, లేదంటే జనసేనతో పొత్తు ఉండాల్సిందేనని సింగ్ ఇచ్చిన తాజాగా నివేదికలోని ప్రధానం అంశమట. ఆ విషయాన్ని తెలుసుకున్న సీనియర్లు రాబిన్ సింగ్ తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీలోని కోర్ టీమ్ వద్ద అనుమానం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో రాబిన్ వర్సెస్ సీనియర్లు మధ్య కోల్డ్ వార్ కు బీజం పడింది. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ బూత్ కమిటీల ఏర్పాటుకు డెడ్ లైన్ పెట్టారు చంద్రబాబు. ఎంత వరకు ఆయన ఆదేశం 100 శాతం అమలు అవుతుందో చూడాలి.
Related News

Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మసాక్షి లేటెస్ట్ సర్వే వెల్లడి!!
Chandrababu CM : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సర్వే లేటెస్ట్ గా తేల్చేసింది.