Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు
Chandrababu Arrest : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
- By Pasha Published Date - 06:53 AM, Sun - 10 September 23

Chandrababu Arrest : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ మూడో అదనపు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. జడ్జికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా తదితరులు వాదిస్తున్నారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏసీబీ కోర్టుకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో.. పోలీసులను భారీ సంఖ్యలో కోర్టు దగ్గర మోహరించారు. కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకపోతే.. ఆందోళనలు జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు విజయవాడలో ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏసీబీ కోర్టుకు బయలుదేరిన టీడీపీ నేత కేశినేని నానిని పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ఇక నారా లోకేష్ , భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కొంతమంది నేతలు ఏసీబీ కోర్టు దగ్గరికి చేరుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు 24 గంటల్లో (ఆదివారం ఉదయం) ఏసీబీ కోర్టు (సిటీ సివిల్ కోర్టు)లో హాజరుపరిచారు.
Also read : Pawan Kalyan: ఏపీలో అర్థరాత్రి హైడ్రామా.. పోలీసులు వాహనంలోనే మంగళగిరికి చేరుకున్న పవన్..!
తెల్లవారుజామున 3 గంటల తర్వాత..
అంతకుముందు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల తర్వాత చంద్రబాబును (Chandrababu Arrest) విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ కు తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీమ్.. చంద్రబాబుకు దాదాపు 45 నిమిషాల పాటు మెడికల్ టెస్టులు చేసింది. ఏ టెస్టులు చేసిందీ చెప్పని డాక్టర్లు, రొటీన్ టెస్టులను నిర్వహించామని చెప్పారు. మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత ఉదయం 4.30కి చంద్రబాబును సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ గంటపాటూ ఉంచిన అధికారులు.. తర్వాత ఏసీబీ కోర్టుకి తరలించారు.
ఇవాళ గవర్నర్ తో టీడీపీ నేతల భేటీ
సీఐడీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు, ఇవాళ విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలవనున్నారు. ఉదయం 9.30 గంటలకు వారికి గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. 2 రోజులుగా చంద్రబాబుకు నిద్రలేకుండా చేశారని, కనీసం ప్రోటోకాల్ నిబంధనలను పాటించట్లేదని గవర్నర్‌కి టీడీపీ నేతలు చెప్పనున్నారు. ఈరోజు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది.