China Pigeons: చైనా.. పావురం కథ!
మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా... పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది.
- By Hashtag U Published Date - 08:00 AM, Thu - 13 January 22
STORY BY -చిరంజీవి వర్మ
మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా… పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది. అలాంటి పావురం విదేశీ గూడచారి పాత్ర పోషించగలదా? ఈ మధ్య కాలంలో అక్కడక్కడా దొరికిన పావురాలు ఈ ప్రశ్నని రేకెత్తిస్తూ జనంలో ఆందోళనకి కారణమమయ్యింది. అటు ఒరిస్సాతో పాటూ ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని పావురాలు స్థానికులకి దొరికాయి. వాటి కాళ్ళకి రింగులు, వాటి మీద కొన్ని నంబర్లూ వుండడం కలవరపాటుకి గురి చేసింది. దీంతో వాటిని పోలీసులకి అప్పగించారు.
అంతే మీడియాకి మంచి మషాలా దొరికింది. ముందూ వెనకా ఆలోచించకుండా ఇదిగో పీజియన్ అంటే… అదిగో డ్రాగన్ అంటూ గుక్క తిప్పుకోకుండా చైనాకి చెమట్లు పట్టించడానికి ప్రయత్నించారు. ఇన్ని పావురాలు ఒకేసారి దొరకడం ఏమిటి? అన్న ఆలోచన ఒక్కరికీ వచ్చిన పాపానపోలేదు. వచ్చుంటే… ఏటా ఈ సీజన్ లో పీజియన్ స్పోర్ట్స్ జరుగుతాయని, ఇవన్నీ అందులో పాల్గొన్న హోమింగ్ పీజియన్స్ అన్న సంగతి తెలిసి వుండేది. ఇండియా అనే కాదు, అన్ని దేశాల్లోనూ పావురాల పందాలు జరుగుతుంటాయి. వీటిని నిర్వహించడానికి, ఆయా దేశాల్లోని ఆయా ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా క్లబ్స్ ఉంటాయి. ఈ క్లబ్బులు ల్లో సభ్యులుగా ఉన్న, వారి పావురాలని మాత్రమే రేసుకి అనుమతిస్తారు. ఇందుకుగాను ఆ క్లబ్ తమ సభ్యులకి రెండురకాల రింగులని కేటాయిస్తుంది. ఇందులో ఒక రింగు మీద ఆ క్లబ్ పేరు, ఆ సంవత్సరం, ఆ రింగ్ ఏ నంబర్ దో ఆ నంబర్ ముద్రించి ఉంటుంది.
ఇంకో రింగు మీద ఆ సభ్యుడి పేరు, ఫోన్ నంబర్ ముద్రించి వుంటాయి. ఈ రింగులని, రోజుల పిల్లగా వున్నప్పుడే పావురం రెండు కాళ్ళకీ తొడుగుతారు. పావురం పెద్ద అయితే… ఈ రింగులు తొడగడానికి కుదరదు. అలా ఈ రింగులు వున్న పావురాలని మాత్రమే డిసెంబర్, ఏప్రియల్ నెలల మధ్య జరిగే రేసింగుకి అనుమతిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రేసు పావురాలకి ఇది ఒక ప్రోటోకాల్. దేశీయంగా రెండు వందల నుంచి వెయ్యి కిలోమీట్ర్ల దూరం వరకూ ఈ పావురాల రేసింగ్ జరుగుతూ ఉంటుంది. స్థానికంగా ఉన్న క్లబ్ తమ మెంబర్స్ పావురాలన్నిటినీ సేకరించి వాటి కాళ్లకి వున్న రింగ్స్ మీద ఆ టోర్నీ డిటైల్స్ కి సంబంధించిన స్క్రాచ్ కార్డ్స్ అంటిస్తుంది.
తర్వాత వాటన్నిటినీ తీసుకు వెళ్లి, నిర్దేశిత దూరంలో విడిచి పెడుతుంది. అలా విడిచిన వాటిలో… ఏ పావురం ముందుగా తన గూటికి చేరుతుందో దాన్ని విజేతగా గుర్తిస్తారు. పావురం తన తిరుగు ప్రయాణంలో గ్రద్ద, డేగలాంటి శత్రు దాడులకి గురవడమో… విద్యుద్ఘాతాలు, ఈదురుగాలులు వంటి ప్రతికూల పరిస్థితులకి గురవడమో జరుగుతుంటుంది. అలాంటప్పుడు అవి తనని తాను కాపాడుకోవడానికి ప్రయాణ దిశని మార్చుకోవచ్చు. ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఎక్కడైనా ఆగడం కానీ… నీరసం వల్ల ఎగరలేక సొమ్మసిల్లి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇటీవల దొరికిన పావురాలు ఈ కోవలోనివే. ఈ ఏడాది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల పావురాలని కలకత్తాలో లిబరేట్ చేసారు. ఒరిస్సాలో దొరికిన పావురాలు ఇవే.
ఆంధ్రా పావురాలని కలకత్తాలో వదిలినట్లే, తమిళనాడు పావురాలని ఆంధ్రాలో వదిలారు. ఆపావురాలే ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో దొరికినవి. వాటిని అలా వదిలేస్తే నిదానంగా తమ గూటికి చేరుకునే అవకాశం వుంది. ఆ స్క్రాచ్ కార్డులమీద పేర్లని పరిశీలిస్తే… ఇవి, ఆ క్లబ్ కి చెందినవని అర్ధం అవుతుంది. అయితే ఆ రింగులమీద చైనా అక్షరాలు ఎందుకు వున్నాయన్న అనుమానం రావచ్చు. అన్ని ఉత్పత్తుల్లాగే ఈ రింగులూ, స్క్రాచ్ కార్డులూ చైనా ఉత్పత్తులే. అందుకే ఆ చైనా అక్షరాలు. అంతా బాగానే ఉంది. కానీ ఈ పావురాలతో గూడచర్యం నిర్వహించవచ్చా? అన్న కొత్త అనుమానం మనకి రావచ్చు.
అది అంత సులభం కాదు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హోమింగ్ పీజియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్: రావు నారాయణ బాబు. హోమింగ్ పీజియన్ తన గూటికి తను చేరుకుంటుంది తప్ప, తన గూటి నుంచి ఎక్కడకో వెళ్ళి, అక్కడ గూడుపుఠానీలు గూడచర్యాలూ చెయ్యవు. అలా చెయ్యాల్సి వస్తే ఆ చైనా వాడో పాకిస్థాన్ వాడో మన మధ్య మకాం పెట్టి, ఆ గూడచారి పావురాన్ని పెంచి, ఇక్కన్నుంచి అక్కడకి సమాచారాన్ని చేరవెయ్యడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ పావురాలు అక్కడెక్కడో దొరుకుతాయి తప్ప ఇండియాలో దొరికే ప్రసక్తే లేదు. కాబట్టి ఇండియాలో ఇలాంటి పావురాలు దొరికితే… మనం భయాంధోళనలు చెందక్కర్లేదు. దున్నపోతు ఈనిన దూడని అసలే కట్టెయ్యనక్కర్లేదు.
Related News
Khammam: జూన్ 2న ఖమ్మంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
Khammam: జూన్ 2వతేదీన ఖమ్మం లోని టీఎన్జీవో భవన్ ప్రాంగణంలో జరిగే పవర్ వెయిట్ లిఫ్టింగ్,బెంచ్ ప్రెస్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను పవర్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఖమ్మం బురహాన్ పురంలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్రను అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఖమ్మం జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్, సభ్యులు రాప�