BJP Janasena : పొత్తు పొత్తే..అవమానం మామూలే!
`జనసేనతో కలిసే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళతాం..` అంటూ తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు.
- Author : Hashtag U
Date : 06-07-2022 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
`జనసేనతో కలిసే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళతాం..` అంటూ తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు. భీమవరంలో జరిగిని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా పనవ్ విడుదల చేసిన ఒక వీడియోను ఉదహరిస్తూ పొత్తు కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. ప్రధాని మోడీ పాల్గొనే ఆ సభకు జనసైనికులు మద్ధతు పలకాలని పవన్ వీడియోలో ఉన్న సందేశాన్ని వీర్రాజు గుర్తు చేయడం చర్చనీయాంశంగా అయింది.
తొలి నుంచి రెండు రాష్ట్రాల్లోనూ జనసేనకు అడుగడుగునా బీజేపీ రూపంలో అవమానం ఎదువుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పొత్తు అనే అంశం ఎక్కడా వినిపించదు. పైగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పట్టించుకోరు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జనసేనతో మాట్లాడేందుకు కూడా బండి ఇష్టపడలేదు. అంతేకాదు, సభలకు వద్దని పవన్ కు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఎక్కడా జనసేన ఊసు గ్రేటర్ ఎన్నికల్లో కనిపించలేదు. అప్పటి నుంచి ఏ వేదిక మీద కూడా జనసేన కనిపించకుండా తెలంగాణ బీజేపీ జాగ్రత్తపడుతోంది. ఏపీలో మాత్రం ఆ పొత్తు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసిన సందర్భాలు బహు అరుదు.
రెండు పార్టీలు కలిసి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పనిచేశాయి. అక్కడ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని తొలుత ఆ పార్టీ లీకులు ఇచ్చింది. ఆ తరువాత ఇరు పార్టీల లీడర్లు కలిసి నిర్ణయం తీసుకుంటాయని పవన్ చెప్పారు. కానీ, జనసేన పార్టీని ఏ మాత్రం సంప్రదించకుండా లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభను ఆ పార్టీ ప్రకటించింది. ఆ రోజు జరిగిన అవమానాన్ని భరించలేక కొన్ని రోజులు జనసేన క్యాడర్ దూరంగా ఉంది. ఆ తరువాత ఎన్నికల వేదికపైన పవన్ కనిపించారు. దీంతో రెండు పార్టీలు కలిసి పనిచేసినప్పటికీ డిపాజిట్లు రాలేదు. ఆ ఎన్నికల ఫలితాల తరువాత రెండు పార్టీల మధ్య చెడిందని చెప్పుకున్నారు. అంతలోనే బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఆ వెంటనే బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ బీసీలకు ఏపీ సీఎం అభ్యర్థిగా ఇచ్చే అవకాశం ఉందని లీకులు ఇచ్చారు. దీంతో సోము వీర్రాజు కూడా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇలా జరగడం మరోసారి జనసేన అవమానంగా ఫీల్ అయింది.
ఢిల్లీ బీజేపీతో పొత్తు అంటూ జనసేనాని పవన్ చెబుతుంటే, ఆయనే మా వెంట పడుతున్నాడని అమిత్ షా చెప్పాడని కేఏ పాల్ ఇటీవల చెప్పడం గమనార్హం. పలుమార్లు అపాయిట్మెంట్ అడిగినప్పటికీ అమిత్ షా ను జనసేనాని కలవలేకపోయారు. కేవలం నడ్డా వరకు మాత్రమే ఆయన భేటీలు పరిమితం కావడాన్ని జనసేన అవమానంగా ఫీల్ అవుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటులా `అల్లూరి` విగ్రహం ఆవిష్కరణకు పవన్ కు ఆహ్వానం లేకపోగా, అవమానించేలా జనసేనకు ఆహ్వానపత్రిక అందింది. అదే వేదికపైన చిరంజీవి ప్రత్యేకంగా కనిపించడం , ప్రధాని మోడీ ఆలింగనం చేసుకోవడం చూస్తుంటే, ఇంతకంటే అవమానం జనసేనానికి మరొకటి ఉండదు. అయినప్పటికీ పొత్తు కొనసాగుతుందని సోము వీర్రాజు చెప్పడం విశేషం. ఆయన తాజా వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.