AP : పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పై షర్మిల ఆగ్రహం
పొన్నవోలు టాలెంట్‌లో కేవలం స్వామి భక్తి, జగన్ భక్తి మాత్రమే కనిపించిందన్నారు
- Author : Sudheer
Date : 28-04-2024 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
తనపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) చేసిన వ్యాఖ్యలపై షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళ అని సంస్కారం లేకుండా, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌తో మాట్లాడుతున్నాననేది లేకుండా ఏకవచనంతో పొన్నవోలు సంభోదిస్తూ ఊగిపోయారని ఆరోపించారు. పొన్నవోలు టాలెంట్‌లో కేవలం స్వామి భక్తి, జగన్ భక్తి మాత్రమే కనిపించిందన్నారు. నిజానికి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జిషీటులో వైఎస్ఆర్ పేరును చేర్చలేదన్నారు. అడ్వకేట్ పొన్నవోలు వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జిషీటులో లేకపోతే జగన్ బయటకు రావడం కష్టమని భావించారన్నారు. జగన్ ఆదేశాల మేరకే సీబీఐ ఛార్జిషీటులో వైఎస్సార్ పేరును పొన్నవోలు పెట్టారన్నారు వైఎస్ షర్మిల. అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని పొన్నవోలుకు సీఎం జగన్ ఇచ్చారని తెలిపారు. జగన్ సీఎంగా మే 30న పదవీ స్వీకారం చేయగా, కేవలం ఆరు రోజుల్లోనే ఆయనకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారన్నారు. ఇదీ ముమ్మాటికీ క్విడ్ ప్రోకో కాదా మీరే ఆలోచించాలన్నారు. పులివెందుల వేదికగా సీఎం జగన్ మాట్లాడిన దానికి తాను కౌంటర్ ఇస్తున్నానని తెలిపారు. వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీటులో చేర్చిందని జగన్ చేసిన కామెంట్స్‌కి దానికి బదులు ఇచ్చానని గుర్తుచేశారు షర్మిల.
అంతకు ముందు సుధాకర్ రెడ్డి ఏమన్నారంటే..
మీ తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నిలదీశారు. షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. మహానుభావుడైన వైయస్ఆర్ మీద ఆరోపణలు చేస్తుంటే, కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం వైయస్ జగన్‌ను చూడనేలేదు. వైయస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, వైయస్ జగన్‌కు ఏం సంబంధం ఉందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. తండ్రి మీద షర్మిలకు ప్రేమ ఉంటే శంకర్రావు రాసిన లేఖ చదవాలి. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఆయన ప్రశ్నించారు.