AP Liquor Case : మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
AP Liquor Case : సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేసిన 10 పేజీల "రిజన్ ఫర్ అరెస్ట్" రిపోర్ట్‌లో మిథున్ రెడ్డి పాత్రను స్పష్టంగా వివరించారు
- By Sudheer Published Date - 04:19 PM, Sun - 20 July 25

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) లిక్కర్ స్కాం(AP Liquor Case)లో ప్రధాన నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేసిన 10 పేజీల “రిజన్ ఫర్ అరెస్ట్” రిపోర్ట్‌లో మిథున్ రెడ్డి పాత్రను స్పష్టంగా వివరించారు. మద్యం విధానం మార్పు, అమలు ప్రక్రియలో అతడి ప్రమేయం ఉందని పేర్కొన్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు స్వీకరించినట్లు, అవి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడ్డట్లు వివరించారు.
ఈ స్కాం అమలులో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆయనకు ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపి, ప్రత్యేక అధికారిగా నియమించారని వెల్లడించారు. సత్యప్రసాద్‌ను మిథున్ రెడ్డి కుట్ర కోసం వాడుకున్నారని, బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై భారీగా డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఆదాయానికి రూ.3,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు స్పష్టం చేశారు.
Earthquakes: రష్యాలో భారీ భూకంపం.. హెచ్చరికలు సైతం జారీ!
రిమాండ్ రిపోర్ట్‌లో మరో కీలక అంశం ఏమిటంటే.. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ముడుపులను అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఇది కేవలం ఎలక్షన్ నిధుల నిర్వహణకు పరిమితం కాకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి రాజకీయ ప్రయోజనం కోసం భారీ స్థాయిలో అవినీతిని చొప్పించిన ఉదాహరణగా పేర్కొనబడింది. నిందితుల రాజకీయ బలం కారణంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే కస్టడీలో విచారణ అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇంతటి భారీ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించడంతో పాటు, ఈ కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని సిట్ అధికారులు స్పష్టం చేశారు. గతంలోనూ మిథున్ రెడ్డిపై ఏడుకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం అరెస్టైనవారు, పరారీలో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తం వ్యవహారంలో ఎవరు ఎవరు లబ్ధిదారులయ్యారన్న దానిపై పూర్తి స్పష్టత రావడానికి సుదీర్ఘ దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.