Seediri Appalaraju : హాస్పటల్ లో చేరిన మాజీ మంత్రి అప్పలరాజు
seediri appalaraju : పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు
- By Sudheer Published Date - 09:49 AM, Thu - 31 October 24

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
స్వతహాగా గుండె సంబంధిత వైద్యాధికారి కావడంతో ప్రాథమిక చికిత్స ఆయనే స్వయంగా చేసుకున్నారు. సీటీ స్కాన్ నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేవని డా.అన్నాజీరావు తెలిపారు. ఇదిలా ఉండగా అప్పలరాజు అస్వస్థతకు గురైన విష యం తెలుసుకున్న పలాస నియోజకవర్గ వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుసు కొని ఊపిరి పీల్చుకున్నారు. అప్పలరాజు వెంట ఆయన సతీమణి సీదిరి శ్రీదేవి ఉన్నారు.
సీదిరి అప్పలరాజు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, దేవునల్తాడ గ్రామంలో జన్మించాడు. 1నుంచి 7వ తరగతి వరకు ఎంపీయూపీ స్కూల్, దేవునాల్తాడ గ్రామంలో చదివాడు. 8 నుంచి 10తరగతి వరకు సింహాచలం (అడివివరం స్కూల్) గురుకుల పాఠశాలలో పూర్తి చేశాడు. అప్పలరాజు పదో తరగతిలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించాడు. ఆయన గాజువాక మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ఓపెన్ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంటనే ఎంట్రన్స్ పరీక్షలో పాసై విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ లో పీజీ పోర్ర్తీ చేసి, పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించాడు.
2017లో వైసీపీ పార్టీలో చేరి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు. సీదిరి అప్పలరాజు 2020 జులై 22న మంత్రిగా నియమితుడై, జులై 26న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
Read Also : Strong Quake: అమెరికాలో భారీ భూకంపం.. తీవ్రత ఎంతంటే?