AP : శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు సిగ్గుచేటు: చంద్రబాబు
- By Latha Suma Published Date - 03:07 PM, Thu - 9 May 24
Chandrababu: దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారు. పశ్చిమాన ఉండే వారు అరబ్ జాతీయుల్లా ఉంటారు. ఉత్తరాది వారు తెల్ల జాతీయులలా కనిపిస్తారు. అంటూ..కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా(Sam Pitroda) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. భారత రాజకీయాలలో ఉన్న వారు, వాటిని ప్రభావితం చేసేవారంతా భారత దేశ అంత:సూత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని నిలబెట్టాలని కోరారు. దక్షిణాది వారికి ఓ ప్రత్యేకమైన సంస్కృతి, గుర్తింపు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆఫ్రికా వారికి కూడా తమదైన సొంత గుర్తింపు ఉందని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
మనం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు చెందినవారమైనప్పటికీ ముందు మనమంతా భారతీయులమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వ్యక్తుల గుర్తింపును వారి వేషధారణ, రూపం, చర్మపు రంగు వంటి వాటితో కుదించి పోల్చడం నిజంగా సిగ్గు చేటని విమర్శించారు. ఇటువంటి తిరోగమన, జాత్యహంకార వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, శ్యామ్ పిట్రోడా చేసిన విభజన వాద, జాత్యహంకార వ్యాఖ్యలకు నాగరిక సమాజంలో తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు.