YCP : రాజీనామా చేసే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు..? రోజా కామెంట్స్ కు అర్ధం ఇదేనా..?
YCP : జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని రోజా వ్యాఖ్యానించడంతో, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి
- Author : Sudheer
Date : 24-02-2025 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ(AP Assembly Sessions)లో వైసీపీ సభ్యుల (YCP Leaders) తీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేయడమే కాకుండా, గవర్నర్ ప్రసంగం కాపీలను చించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా (Roja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని రోజా వ్యాఖ్యానించడంతో, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో తనకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న జగన్, తన అనుచరులతో కలిసి మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీ ప్రభుత్వంపై రోజా విమర్శలు
టీడీపీ ప్రభుత్వ తీరు పై రోజా తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని తొలగించి, కేవలం భజన చేసే మీడియానే అనుమతించారని ఆరోపించారు. “ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను తలపించేలా ఏపీలో కూటమి పాలన సాగుతోంది” అంటూ ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం లక్ష కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కానీ ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని రోజా విమర్శించారు.
పవన్ కళ్యాణ్‌పై రోజా ఫైర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు రోజా తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ హుందాతనం గురించి మాట్లాడడం అతిశయోక్తిగా ఉందని, ఆయన ప్రజలను మోసగించేందుకు ప్రతిరోజూ కొత్త కొత్త పాత్రలు పోషిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేకపోతున్న పవన్, జగన్‌ను ప్రశ్నించే హక్కు ఉందా అని రోజా ఎదురు ప్రశ్నించారు. గవర్నర్‌పై గౌరవం ఉంటేనే జగన్ అసెంబ్లీకి వచ్చారని, పవన్ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో వైసీపీ లేదని ఆమె స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో భయం అనే భావన లేదని, అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని రోజా వ్యాఖ్యానించారు.
Revanth Reddy : 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు?: సీఎం రేవంత్ రెడ్డి