Rivers Interlinking Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘తెలుగు తల్లికి జలహారతి’!
రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.80 వేల కోట్ల వ్యయంతో అమలు చేయనున్నామని పేర్కొన్నారు.
- Author : Kode Mohan Sai
Date : 03-01-2025 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
గోదావరి జలాలను బనకచర్లకు తరలించే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు, సీమకు నీళ్లు అందించే ఆలోచన ఎవరూ చేయలేదని చెప్పారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో ఓ ఒప్పందం జరిగిందని, ఆ సమయంలో శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ ద్వారా నీళ్లు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అని చెప్పారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ మరియు తమిళనాడుకు నీళ్లను అందించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
90 శాతం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత టీడీపీదే
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మరియు ఏపీలో 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభించి, పూర్తి చేసిన ఘనత టీడీపీది. గండికోట, కండలేరు, సోమశిల వంటి అనేక ప్రాజెక్టులను నిర్మించామన్నారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో, నాటి కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.
తెలంగాణలోని 7 మండలాలను ఏపీకి ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రధాని మోదీకి చెప్పగా, ఆ 7 మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని తెలిపారు. నీటి విషయంలో ఎన్టీఆర్ ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించి, వెలుగొండ ప్రాజెక్టుకి పునాదిరాయి వేసారని, అలాగే ఉత్తరాంధ్రలో తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేశామన్నారు.

Rivers Interlinked
80 లక్షల మందికి తాగునీరు… 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు
గోదావరి నుండి సముద్రంలో వృథా పోయే 3,000 టీఎంసీల నీటిలో 300 టీఎంసీలను ఒడిసిపట్టడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు అందించేందుకు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుని మూడు దశల్లో పూర్తి చేసే ప్రణాళికలు ఇప్పటికే రూపొందించామని తెలిపారు. మొదటి దశలో, పోలవరం నుండి కృష్ణా నదికి నీరు మళ్లించడం, రెండవ దశలో, బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలించడం జరుగుతుందని చెప్పారు. మూడవ దశలో, బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్లకి నీటిని మళ్లిస్తామని చెప్పారు.
గోదావరి నుండి నీటిని కృష్ణా నదికి, అక్కడ నుండి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలించి, అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తీసుకువస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, రాయలసీమను రతనాలసీమగా మారనుందని, పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు అందించవచ్చని, అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరవును అరికట్టవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
రిజర్వాయర్‌ల నిర్మాణంతో నీటి సమస్యకు పరిష్కారం
ఉత్తరాంధ్రలో వర్షపాతం ఎక్కువగా ఉన్నా నీటి కొరత ఉందని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు వల్ల పంట సాగు బాగా దెబ్బతింది. సకాలంలో నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రతనాలసీమగా మార్చవచ్చు. గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉండేది. మా ప్రభుత్వంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో తలసరి ఆదాయం 4-5 శాతానికి చేరింది. పట్టిసీమ రాకతో సకాలంలో పంట చేతికి అందుతోంది. 1970లో 371 టీఎంసీల నీరు 1994లో 5,959 టీఎంసీల నీరు 2024లో 4,114 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందని వివరించారు.

River Water Floated In To The Sea In Last 50 Years
ఈ 50 ఏళ్లలో సగటున యేడాదికి 3 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. ఈసారి వరుణుడు కరుణించడం, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతగా పనిచేయడంతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 983 టీఎంసీలు నీటి నిల్వ ఉందని ప్రస్తుతం రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 729 టీఎంసీలుగా ఉందన్నారు. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కడితే రాష్ట్రంలో నీటి సమస్య అనేదే ఉండదన్నారు.
గత పాలకుల అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాము. భావితరాలకు ఉపయోగపడే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలని ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు పార్టనర్ షిప్‌ను చేర్చే అంశాన్ని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించానని డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.