Pawan Kalyan : జనసేనానికి ’35’ సినిమా
ఏపీ టిక్కెట్ల ధర తగ్గింపు, ఆన్ లైన్ విధానం వెనుక జనసేనాని పవన్ రెమ్యునరేషన్ తగ్గించడానికే అంటూ ఆ పార్టీ భావిస్తోంది. ఉచితంగా సినిమాలను ఆడిస్తానంటూ పవన్ చెబుతున్నాడు. ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య అగాధం ఏర్పడేలా 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కామెంట్స్ బీజం వేశాయి.
- By CS Rao Published Date - 02:57 PM, Sat - 25 December 21

ఏపీ టిక్కెట్ల ధర తగ్గింపు, ఆన్ లైన్ విధానం వెనుక జనసేనాని పవన్ రెమ్యునరేషన్ తగ్గించడానికే అంటూ ఆ పార్టీ భావిస్తోంది. ఉచితంగా సినిమాలను ఆడిస్తానంటూ పవన్ చెబుతున్నాడు. ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య అగాధం ఏర్పడేలా ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కామెంట్స్ బీజం వేశాయి. ఆనాడు పవన్ చేసిన వ్యాఖ్యలు కారణంగా జీవో 35 తీసుకొచ్చే వరకు వెళ్లిందని జనసేన హైలెట్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో పవన్ ఒకరు. ఆయన తరహాలోనే భారీ రెమ్యురేషన్ తీసుకునే హీరోలు జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నారు. ఇలాంటి టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలు జగన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువ. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం పవన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందా? అనే ప్రశ్న వేసుకుంటే టాలీవుడ్ లో వినిపిస్తోన్న భిన్నస్వరాలే సమాధానం చెబుతున్నాయి.
జగన్ సర్కార్ ఆన్ లైన్ టిక్కెట్ విధానం ప్రవేశపెట్టడానికి ముందుగా జరిగిన వ్యవహారాన్ని ఒకసారి అవలోకనం చేసుకోవాలి. సినిమా పరిశ్రమను గాడిలో పెట్టడానికి ప్రముఖులు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. అందుకు సంబంధించిన పత్రాలను మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని బయటపెట్టారు. ఆ నివేదికపై ఉన్న సంతకాలను కూడా చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా భావిస్తోన్న చిరంజీవి తో సహా పలువురు కలిసి సీఎం జగన్ కు ఆ నివేదికను ఇచ్చారని మంత్రి చెబుతున్నాడు.రెండుసార్లు సీఎం జగన్ ను కలిసిన బృందానికి చిరంజీవి నాయకత్వం వహించాడు. సినిమా పరిశ్రమ గురించి, పేద కళాకారులకు ఇళ్ల స్థలాలపై మాట్లాడామని కూడా వెల్లడించాడు. ఆ సందర్భంగా హీరో బాలక్రిష్ణ కూడా రియాక్ట్ అయ్యాడు. భూములు పంచుకోవడానికి సీఎంల వద్దకు తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉండగా, ఏపీ ప్రభుత్వం చిరంజీవి అండ్ టీం ఇచ్చిన నివేదికను పరిశీలించింది. ఆ మేరకు ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం తీసుకురావాలని భావించింది. ఆ విషయాన్ని మీడియాముఖంగా చెప్పడంతో `రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సామాజిక కోణాన్ని పైకితీసి వివాదానికి పవన్ ఆజ్యం పోశాడని టాలీవుడ్ టాక్.
ఆ రోజు నుంచి ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య అగాధం ఏర్పడింది. దాన్ని పూడ్చుకోవడానికి దిల్ రాజు, నట్టికుమార్ లాంటి ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు ఏపీ మంత్రులను, సీఎంను కలిశారు. జీవో 35పై సంప్రదింపులు జరుపుతున్నారు. ఆలోగా ఈ వివాదాన్ని రాజకీయ కోణం నుంచి పవన్ టీం దూకుడుగా తీసుకెళుతోంది. కేవలం పవన్ కల్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ జగన్ గేమ్ ఆడుతున్నాడని జరుగుతోన్న ప్రచారాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. పూర్వపరాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది.ఇలాంటి వివాదాలను లైట్ గా తీసుకున్న హీరో బాలక్రిష్ణ థియేటర్లలో అఖండంగా దూసుకుపోయాడు. అఖండ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సీనియర్ హీరోలు ఎవరూ ఇప్పటి వరకు జగన్ సర్కార్ నిర్ణయంపై మాట్లాడేందుకు ముందుకు రాలేదు. కేవలం హీరోలు పవన్, నాని, సిద్ధార్థలు మాత్రమే వాయిస్ వినిపించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. సో…జీవో 35 కేవలం పవన్ కోసమేనంటూ జరుగుతోన్న ప్రచారంలోని లోగుట్ట ఏమిటో తేలాల్సిందే.