White Gold : ఆ రెండు జిల్లాల్లో ‘వైట్ గోల్డ్’ .. వాట్ నెక్స్ట్ ?
White Gold : అత్యంత విలువైన లిథియం నిల్వలను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడప జిల్లాల్లో గుర్తించారు.
- By Pasha Published Date - 08:06 AM, Mon - 25 September 23

White Gold : అత్యంత విలువైన ఖనిజం లిథియం. దీన్ని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన ఖనిజ నిల్వలను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడప జిల్లాల్లో గుర్తించారు. ఈ జిల్లాల సరిహద్దులో లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక ఇచ్చింది. ఈ జిల్లాల్లోని లింగాల, తాడిమర్రి, ఎల్లనూరు మండలాల్లో దాదాపు 5 చదరపు కి.మీ. (500 హెక్టార్ల) మేర లిథియం నిల్వలు ఉంటాయని అంచనా వేసింది. పెంచికల బసిరెడ్డి జలాశయం (గతంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం) చుట్టుపక్కల ఈ నిల్వలు ఉన్నాయని అంటున్నారు.
Also read : Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, ఇతర ప్రాంతాల నుంచి లిథియం శాంపిల్స్ ను ఇప్పటికే సేకరించారు. వాటిని పరిశీలించిన తర్వాతే.. కొన్ని నెలల కిందట జీఎస్‌ఐ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. కచ్చితంగా ఎంతమేర లిథియం నిల్వలు ఉన్నాయనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ ఖనిజాల కోసం అన్వేషణకు అనుమతులివ్వాలని ఏపీ గనులశాఖ కొద్ది రోజుల క్రితం కేంద్రాన్ని కోరింది. అయితే లిథియం పరమాణు ఖనిజం కావడంతో అణు ఇంధన సంస్థ (డీఏఈ) నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర సర్కారు సూచించింది. ఇటీవల ఏపీలో బంగారం గనుల్ని కూడా గుర్తించారు. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల (White Gold) గనులు ఉన్నాయని వెల్లడైంది. అక్కడ గనుల బ్లాకుల్ని కేటాయించాలని ఎన్‌ఎండీసీ కోరింది.