Chandrababu: ఖైదీ నంబర్ 7691
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సెంట్రల్ జైలు రహదారిని దిగ్బంధించారు
- By Praveen Aluthuru Published Date - 06:10 AM, Mon - 11 September 23

Chandrababu: చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సెంట్రల్ జైలు రహదారిని దిగ్బంధించారు. పోలీసులు ప్రత్యేక భద్రతతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు తీవ్ర ఉత్కంఠ మధ్య తీర్పును ప్రకటించింది. చివరకు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి ఏడున్నర గంటలకు పైగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిశాక.. కోర్టు ప్రాంగణంలో కొంత హైడ్రామా అనంతరం సీఐడీ వాదనలతో ఏసీబీ న్యాయమూర్తి ఏకీభవిస్తూ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబే సూత్రధారిగా సీఐడీ అధికారులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే చంద్రబాబు ఈ నేరానికి పాల్పడ్డారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మొత్తం రూ. 371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని వాదన. సీమెన్స్ 90 శాతం ఖర్చు భరిస్తుందని కేబినెట్‌లో అబద్ధాలు చెప్పారని, ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఆమోదించారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరం తెలిపినా.. పట్టించుకోలేదని, సీఎం, సీఎస్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశామని, డిజైన్ టెక్ కంపెనీకి రూ. 259 కోట్లు పక్కదారి పట్టినట్లు నివేదికలో స్పష్టమైంది.
ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో వాదనల సందర్భంగా చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి సాయంత్రం తీర్పు వెలువరించారు. చంద్రబాబుకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్.
Also Read: Chandrababu Remand : నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత – పవన్