PK Secret Report : జగన్ ను అలెర్ట్ చేసిన పీకే సీక్రెట్ రిపోర్ట్!!!
- By Hashtag U Published Date - 09:56 PM, Mon - 24 January 22

మూడు అంశాలపై జగన్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదిక
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని నివేదికలో పేర్కొన్న పీకే
పార్టీ నేతల వ్యవహారశైలిపై ఫిర్యాదు
దేశంలోనే రాజకీయ వ్యూహకర్తలకు ఆయా పార్టీలు అత్యధిక ప్రాధాన్యతిస్తూ ఉంటాయి. ఇండియాలోనే అలా పేరొందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(పీకే) ఒకరు. ఆయన్ని అందరూ ముద్దుగా, సింపుల్ గా పీకే అని పిలుస్తారు. ఇతడు ఆయా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు రాజకీయ వ్యూహకర్త పీకే అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎంత సహకరించారో… ఆయన నివేదికలు ఎంతవరకు సఫలం అయ్యాయో మనం చూశాం. ఇక అప్పటి నుంచి ఆయన టీమ్ నుండి ప్రతి నెలా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ కు నివేదికలు అందుతూనే ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం గ్రామాల్లో లబ్దిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? దీని వల్ల ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా..? లేదా మైనస్ అవుతుందా..? అనేది తెలుసుకుంటారు. అలానే లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారా..? లేదా…? అనేది కూడా తెలుసుకుని ప్రశాంత్ కిషోర్ టీమ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నివేదిక ఇస్తుంది. అయితే ఇటీవల పీకే ఇచ్చిన రిపోర్ట్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అది కూడా ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ వచ్చే ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడం కష్టమే అని పీకే జగన్ కు రిపోర్టు ఇచ్చారంటూ వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదనే టాక్ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎన్ని సీట్లు కోల్పోవల్సి వస్తుంది అనే రిపోర్ట్ మాత్రం ఇవ్వలేదని సమాచారం. కాకపోతే.. ఏపీ స్టేట్ లోని ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితి ఎలా ఉంది..? ఎక్కడెక్కడ ప్రతికూల పరిస్థితులున్నాయి…? వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది మాత్రమే జగన్ కు పీకే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే… ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 60 నుండి 70 నియోజకవర్గాల్లో అధికార పార్టీపై కొంత వ్యతిరేకత ఉన్నట్లుగా చెప్పినట్లు సమాచారం.
మూడు అంశాల్లో జగన్ ను అలెర్ట్ చేసిన పీకే రిపోర్ట్:
రాజకీయ వ్యూహకర్త పీకే నివేదికలో కొన్ని విస్తుపోయే అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా చూస్తే…. మూడు విషయాల్లో ప్రశాంత్ కిషోర్ నివేదిక జగన్ ను అలర్ట్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏపీలో ప్రస్తుత పరిస్థితే కనుక కొనసాగితే… జగన్ సర్కార్ కి ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ మూడు అంశాలు ఏంటంటే..
పీకే రిపోర్ట్ లో మొట్టమొదటిది ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి సంబంధించిన అంశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పులెన్ని చేసినా గానీ, వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలో ప్రజలకు వాటిని పంపిణీ చేస్తున్నాము… దీని వల్ల ప్రజల్లో సానుకూలత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలానే రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పులను ప్రజలు పట్టించుకోరు. వాళ్ల జేబుల్లోకి అందే డబ్బులనే పట్టించుకుంటారు అనేది సర్కార్ ఆలోచనగా ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన రిపోర్ట్ లో వెల్లడించిన విషయం ఏంటంటే… రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సైతం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నదే. ప్రభుత్వం చేస్తున్న అప్పులను ప్రజలు పట్టించుకుంటున్నారనీ…. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని వారు భావిస్తున్నట్లు పీకే నివేదికలో తేలింది. దీంతో ఆర్ధిక పరిస్థితిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ ను పీకే అలర్ట్ చేసినట్లు సమాచారం. ఆర్ధిక పరిస్థితిని అదుపు చేయాలంటే… ముందుగా అప్పులు తీసుకోవడం మానేయాలి. అప్పులు చేయడం మానేస్తే.. ఆన్ గోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ ను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంక్షేమ పథకాలను నిలిపేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఏ ప్రభుత్వ పథకమైనా సరే ఒక్కసారి ప్రజలకు అలవాటు చేసి, వాటిని తిరిగి ఆపివేస్తే సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం కూడా అవివేకమే అవుతుందని జగన్ కు ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఇక నివేదికలోని రెండో అంశం విషయానికొస్తే… మూడు రాజధానుల వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అనే విషయంలో ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయితే… ప్రజల్లోకి వెళ్లింది మరొక్కటి. దీని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజ్ రాకపోగా.. కొన్ని జిల్లాల్లో పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విశాఖపట్నం ను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల అక్కడ సానుకూలత వస్తుందని ప్రభుత్వం అనుకుంటే… అక్కడ కూడా నెగిటివ్ వచ్చిందట. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్న ఆరోపణలు వచ్చాయట. వీటికి తోడు ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా మరింత పెరిగిందట. రాజధాని వికేంద్రీకరణ అంశంపైనా ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ ను అలర్ట్ చేసినట్లు సమాచారం. ఇక వైజాగ్ లో రావాల్సినంత పాజిటివ్ రాకపోగా.. విశాఖపట్నం సహా… ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి కాస్త నెగిటివ్ వచ్చినట్టు పీకే తన రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ నేతల వ్యవహారశైలికి సంబంధించిన విషయాన్ని పీకే తన నివేదికలో మూడో అంశంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి మొదలుకొని కొందరు నేతలు వినియోగిస్తున్న భాష, వారి ప్రవర్తన, కార్యకర్తల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అనేది తన రిపోర్ట్ లో పీకే పేర్కొన్నారు. అలానే కొందరు నేతల గ్రూపు రాజకీయాల వలన పార్టీకి జరుగుతున్న నష్టానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా నివేదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే అధికార పార్టీకి 60 నుంచి 70 నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం, గ్రూపు రాజకీయాలు, కొన్ని వివాదాలు, మరికొన్ని అవినీతి ఆరోపణలు వలన బాగా వ్యతిరేకత వచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ లో వెల్లడైనట్లు సమాచారం. ఈ మూడు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ను ప్రశాంత్ కిషోర్ అలర్ట్ చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతానికైతే వైసీపీ ఓడిపోయేంత వ్యతిరేకత లేనప్పటికీ… మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం కొన్ని మార్పులు చేసుకోవాలని జగన్ కు పీకే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అప్పులే చేయాల్సిన అవసరం లేదని…. ఆదాయ మార్గాలను అన్వేశించాలని… ఆదాయం పెంచుకోవడం అంటే పన్నులు వేయడం కాకుండా.. ప్రాజెక్టులు, పోర్టులు తదితర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని ఆర్దించడం వంటి వాటిపై ఫోకస్ చేయాలని జగన్ కు ప్రశాంత్ కిషోర్ బృందం నివేదిక ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. పీకే నివేదికలోని అంశాలను పరిశీలించిన జగన్… కొన్ని అంశాలను సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలోనే ఒకవైపు ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేస్తూనే…. ఫిబ్రవరి నెల సెకండ్ వీక్ నుంచి జిల్లాల వారీగా రివ్య్యూ మీటింగ్స్ కండక్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. చూడాలి మరి జగన్ ఏ మేరకు పీకే రిపోర్ట్ ను కన్సిడర్ చేసి, పార్టీపై అక్కడక్కడా వచ్చిన వ్యతిరేకతను మళ్లీ తనకు అనుకూలంగా మార్చుకుంటారో అన్నది.