Tirumala Laddu Issue : తిరుమల లడ్డు విషయంలో సుప్రీం వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్వీట్
Tirumala Laddu Issue : 'దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ఎక్స్(X) ఖాతా వేదికగా పోస్టు చేశారు.
- By Sudheer Published Date - 05:45 PM, Mon - 30 September 24

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందని..జంతువుల కొవ్వు తో లడ్డు తయారీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు మీడియా ముందు తెలుపడం తో ఒక్కసారిగా యావత్ భక్తులు ఆందోళనకు గురయ్యారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు సుప్రీం కోర్ట్ లో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం (AP CM Chandrababu Naidu) చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది. ”ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు (Quality Tests) పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు..? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా..? నెయ్యి కల్తీ జరిగినట్లైనా ఆధారాలు చూపించండి. అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది? నెయ్యిని ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారు? అన్నింటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్ (Testing)కి పంపారా..? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా..?” అని సూటిగా ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో రాజకీయ జోక్యం (Political Interfearance)పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్’ అంటూ తన ఎక్స్(X) ఖాతా వేదికగా పోస్టు చేశారు. ఈ లడ్డు ఇష్యూ బయటకు వచ్చిన దగ్గరి నుండి ప్రకాష్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.