Mylavaram TDP : మైలవరంలో దేవినేని ఉమాకి చెక్ పెడుతున్న లోకల్ లీడర్లు..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో బలంగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది...
- Author : Prasad
Date : 13-09-2022 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఉమ్మడి కృష్ణాజిల్లాలో బలంగా ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికి అది సాధ్యంకాని పనిలా కనిపిస్తుంది. దీనికి కారణం జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరేనని క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మైలవరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారిందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నారని..అధికారం పోయాక మరోలా ఉన్నారని నియోజకవర్గంలో క్యాడర్ ఆరోపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి తమన పట్టించకోవడంలేదని ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది.

Komati Jayaram
అయితే మైలవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలనే నినాదం ఇటీవల తెరమీదకు వచ్చింది. నాన్ లోకల్ అయిన దేవినేని ఉమామహేశ్వరరావుకి టికెట్ ఇవ్వొద్దని.. స్థానికులకు సీటు ఇవ్వాలనే ప్రతిపాదన లోకల్ టీడీపీ నాయకులు అధిష్టానానికి తెలిపిపట్లు విశ్వసనీయ సమాచారం. లోకల్‌గా ఉన్న కోమటి జయరాం, బోమ్మసాని సుబ్బారావులు మైలవరం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో బోమ్మసాని సుబ్బారావు బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు సుబ్బారావు, కాజా రాజ్‌కుమార్‌లు వ్యూహాలు రచించారు. వీరిద్దరి కృషి ఫలితంగానే కొండపల్లిలో టీడీపీ జెండా ఎగిరిందని నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ ఇప్పటికి చర్చించుకుంటున్నారు. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న కోమటి జయరాం టీడీపీ ఎన్నారై విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Bommasani subbarao
గతంలో ఆయన టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ దేవినేని ఉమామహేశ్వరావు పోటీ చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు, అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో కోమటి జయరాం కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కాలంలో కోమటి జయరాం నియోజకవర్గంలోని పలువురు నేతల్ని కలుస్తున్నారు. ఇటు బొమ్మసాని సుబ్బారావు, కోమటి జయరాంలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇరువురు కూడా స్థానికులకే టికెట్ ఇవ్వాలనే నినాదంతో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో మైలవరంలో దేవినేని ఉమాకి లోకల్ టీడీపీ నేతలు చెక్ పెడుతున్నట్లు అర్థమవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో మైలవరం టీడీపీలో లోకల్ నినాదమే పని చేస్తుందా.. లేదా మళ్లీ దేవినేని ఉమాకే అధినేత సీటు ఇస్తారా అనేది వేచి చూడాలి.