AP Politics: మూడు ముక్కలాట! ఎవరికి వారే విజేతలు..!
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశారు. జనసేనాని పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చారు. అందుకే, ఒక్క ఛాన్స్ నినాదాన్ని పవన్ అందుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని నరేంద్ర మోడీ రోడ్ మ్యాప్ పవన్ కు ఇచ్చారని లేటెస్ట్ గా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
- Author : CS Rao
Date : 18-11-2022 - 12:47 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశారు. జనసేనాని పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చారు. అందుకే, ఒక్క ఛాన్స్ నినాదాన్ని పవన్ అందుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని నరేంద్ర మోడీ రోడ్ మ్యాప్ పవన్ కు ఇచ్చారని లేటెస్ట్ గా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో రాబోవు ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీ సాధించిన ఓట్లను గమనిస్తే రాబోవు ఎన్నికల్లో డిపాజిట్లు ఎక్కడా వచ్చే ప్రసక్తే లేదని అంచనాకు రావచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వారం రోజుల క్రితం విశాఖ వచ్చిన నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుని భేటీ అయ్యారు. వాళ్లిద్దరి మధ్యా 20 నిమిషాలకు పైగా సాగిన ఈ చర్చల సారాంశం ఏమిటి అన్నది ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఇది వన్ టూ వన్ గా సాగిన సమావేశం. దాంతో ఆ వివరాల మీద ఎవరికి తోచినట్లుగా వారు వార్తలు రాసుకున్నారు విశ్లేషించుకున్నారు.
Also Read: 2024 Election: ముగ్గురి ఎన్నికల స్లోగన్ ఫిక్స్!
అయితే లేటెస్ట్ గా ఆ గుట్టుని విప్పారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆయన చెప్పినది ఏంటి అంటే తెలుగుదేశంతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని మా ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్కి తెలియచెశారని చెప్పుకొచ్చారు. అంతే కాదు వంశపారంపర్య రాజకీయ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, అలాంటి పార్టీల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పవన్కు తెలియజేశామని ఆయన చెప్పడం సంచలనం రేపుతోంది.
మోడీ కుండబద్ధలు కొట్టినట్లుగా తెలుగుదేశంతో అసలు పొత్తులు ఉండవని పవన్ కి చెప్పేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి అనుగుణంగా ఆ తరువాత విజయనగరం టూర్ లో పవన్ సైతం తమకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరడం కూడా బలపరుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఏపీలో టీడీపీ నుంచి జనసేనను విజయవంతంగా ఢిల్లీ పెద్దలు విడగొట్టారనే అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఒక కూటమిగా ప్రజల మధ్యకు రాబోతున్నాయన్నమాట. టీడీపీ, వైసీపీ వేర్వేరుగా పోటీ చేస్తే ముక్కోణపు పోటీ ఉంటుందని కొందరి భావన.
Also Read: TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్? మోడీ పై తెలుగు పౌరుషం!!
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం పవన్ కి ఇష్టం లేదని జనసేన ఇప్పటికీ వినిపిస్తోంది. ఆ విషయంలో పవన్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా చేస్తారా? అలా కనుక చేస్తే ఏపీలో టీడీపీని అధికారానికి దూరంగా ఉంచవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. బీజేపీ జనసేన కూటమి పవర్ లోకి రాదు అదే టైం లో మరో సారి వైసీపీకి చాన్స్ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కానీ, జనసేన, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా అంచనా వేయడం గమనార్హం.
మరో వైపు చూస్తే చంద్రబాబు లాస్ట్ చాన్స్ అన్న మాటలను కూడా సోము వీర్రాజు తనదైన శైలిలో విమర్శించారు. లాస్ట్ చాన్స్ ఆయనకా లేక ఆయన పార్టీకా అన్న చర్చ కూడా సాగుతోందని సెటైర్లు వేశారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ బీజేపీ, జనసేన కూటమి మధ్యనే పోటీ ఉంటుందని సోము గుడ్డి అంచనా. కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్లు మాత్రం మోడీ విశాఖ వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారని సంతోషిస్తున్నారు. లేదంటే, కనీసం 15 నుంచి 20 స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చేదని అంటున్నారు. మొత్తం మీద మోడీ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి వెళ్లిన తరువాత ఎవరికివారే అనుకూలంగా ఈక్వేషన్లను వినిపించుకోవడం విచిత్రం.
Also Read: Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!