Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
- Author : Vamsi Chowdary Korata
Date : 30-06-2026 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం ముంబైలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణతో పాటు ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల సంతానోత్పత్తి వంటి జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సమస్యను అధిగమించి, పులుల సంఖ్యను పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏపీకి రెండు ఆడ పులులను ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమనసుతో సహకారం అందిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ నిర్ణయం వల్ల తూర్పు కనుమల్లో జన్యు వైవిధ్యం పెరిగి, దీర్ఘకాలిక స్థిరత్వంతో కూడిన ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి గల పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణలో తమకు నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాస్త్రీయ విధానాలతో జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయని, భవిష్యత్తులోనూ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.