Nara Lokesh Redbook: రెడ్ బుక్ లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే చూసారు – నారా లోకేష్
మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామనని ప్రకటించారు.
- Author : Kode Mohan Sai
Date : 02-11-2024 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు. త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్‌ను కూడా తెరుస్తాం’’ అని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘గుడ్‌బుక్‌ను తీసుకువస్తానని జగన్ అంటున్నారు, కానీ ఆ బుక్‌లో ఏం రాయాలో ఆయనకు అర్థం కావడం లేదు’’ అని అన్నారు.
గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు, ఆ నోటీసులకు భయపడకుండా ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్ చేసి చూపారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు తలెత్తుకుని తిరిగే పరిస్థితిని ఎన్టీఆర్ సృష్టించారని తెలిపారు. ఆయన ఆశయాలను సాకారం చేయడంలో ఎప్పుడూ ముందుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
అమెరికాలోని ఆంధ్రుల గురించి మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ కొత్త నిర్వచనమిస్తూ వారిని ఎన్‌ఆర్‌ఐలు కాకుండా “ఎంఆర్‌ఐలు” (మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్) అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ప్రపంచంలోని ప్రతి తెలుగువారి విజయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత కోమటి జయరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో, అభిమానులు హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించారు.
మరోవైపు, నారా లోకేష్ చాఫ్టర్-3 గురించి పార్టీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. నిజంగా మరికొందరి భరతం పడతారా లేదా, లేక పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడానికే లోకేశ్ అలా చెప్పారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. తమకు తెలియకుండానే చాఫ్టర్-1, 2 ముగిసిపోయాయా అని మరికొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఉంది.