Kadapa Temple:ఆ ఆలయంలో పొంగళ్లు సమర్పించేది పురుషులేనట.. !
సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతలకు, దేవుళ్లకు పొంగళ్లు మహిళా భక్తులు సమర్పిస్తారు కానీ ఆ ఆలయంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆలయంలో ఇది జరుగుతుంది.
- Author : Hashtag U
Date : 10-01-2022 - 9:29 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతలకు, దేవుళ్లకు పొంగళ్లు మహిళా భక్తులు సమర్పిస్తారు కానీ ఆ ఆలయంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆలయంలో ఇది జరుగుతుంది. ప్రత్యేకించి గ్రామ దేవతల దేవాలయాలలో, సంజీవరాయ ఆలయంలో నైవేద్యాన్ని సమర్పించే హక్కు పురుషులకు మాత్రమే ఉంటుంది. ఇదే ఇక్కడి ఆచారంగా ఆ గ్రామస్తులు భావిస్తున్నారు
ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే యుక్తవయస్సు రాని బాలికలకు మాత్రం అనుమతి ఉంది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ గ్రామంలోని అన్ని ఇళ్లలోని పురుషులు ‘మకర సంక్రాంతి’కి ముందు ఆదివారం ‘పొంగళ్లు’ వండడానికి కావలసిన పదార్థాలు, పాత్రలను ఆలయానికి తీసుకెళ్తారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ‘పొంగళ్లు’ వండుకుని పీఠాధిపతికి సమర్పిస్తారు. ఆలయం నుంచి తీసుకువచ్చే ప్రసాదాన్ని మహిళలకు ఇవ్వరని… ఇది చాలా కాలంగా ఉన్న సంప్రదాయంగా.. తరతరాలుగా దీనిని అనుసరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.ఈ గ్రామస్థులకు సంక్రాంతి కంటే ఈరోజు ఈ ఆచారం చాలా ముఖ్యమని తిప్పాయపల్లెకు చెందిన రమేష్ నాయుడు తెలిపారు. ఈ పూజలు చేయడం వల్ల వారి కుటుంబాలు అనారోగ్యం, చెడు శకునాల నుండి రక్షించబడతాయని, ముఖ్యంగా వారు సుభిక్షంగా ఉంటారని తెలిపారు
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వృద్ధ ‘సాధు’ (సన్యాసి) ఈ గ్రామాన్ని సందర్శించి, కొంతకాలం అక్కడ ఉండేవాడని గ్రామ పెద్దలు చెబుతారు. అతను హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని.. అతనికి సంజీవరాయ అని పేరు పెట్టారని తెలిపారు. ఈ సాధు పురుషుల నుండి మాత్రమే ఆహారాన్ని స్వీకరించారని ఇక్కడి గ్రామస్తులు తెలిపారు. ఊరు విడిచి వెళ్లే సమయంలో సంజీవరాయుడిని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, శ్రేయస్సు లభిస్తాయని తెలిపారు.