Minister Narayana : మరోసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ‘నారాయణ’
Minister Narayana : సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 01:30 PM, Sat - 26 July 25

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, మెట్రో ప్రాజెక్టులు వంటి కీలక బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ(Minister Narayana)కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన విద్యావంతుడు, దూకుడులేని స్వభావం కలిగిన నాయకుడిగా పేరుగాంచారు. ఇప్పటివరకు వివాదాలకు దూరంగా ఉన్న నారాయణ ఇటీవల మాత్రం మాటల్లో అధిక ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇటీవల ఒక ఇంజనీర్‌పై ‘స్టుపిడ్’, ‘గెట్ ఔట్’, ‘వేస్ట్ ఫెలో’, ‘హోప్లెస్’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్ష మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నారాయణ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అమరావతికి పెట్టుబడులు రాకపోవడాన్ని వ్యాఖ్యానిస్తూ..”అమరావతిని చూసి ఎవరు రావడం లేదు” అనే వాక్యంతో, ఆయన స్వయంగా అభివృద్ధి గురించి సందేహం కలిగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి సందర్భంలో నారాయణ వ్యాఖ్యలు పెట్టుబడిదారులకు భయానక సంకేతాలుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
HHVM 2 : ‘వీరమల్లు 2 ‘అనేది మరచిపోవాల్సిందేనా..?
నారాయణ మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా వారిని బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చిందని, వెంబడించి వారిని తీసుకురావాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మాటలు సీఎంలాంటి నాయకుడి శ్రమను తక్కువ చేస్తూ, పెట్టుబడిదారుల మానసిక పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో ఏర్పడిన అనిశ్చితి వాతావరణం వల్లే పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారన్న విషయం తెలిసిందే.
ఇలాంటి క్లిష్ట సమయంలో రాజధాని పై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. అధికారంలో ఉన్న వ్యక్తులు మౌలికమైన రాజకీయం, పరిపక్వత పాటించాలి. మంత్రిగా ఉన్న నారాయణ వ్యాఖ్యలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పెట్టుబడిదారుల నమ్మకం మరింత దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకనైనా మంత్రి నారాయణ జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో మాట్లాడాలి అని అంత కోరుకుంటున్నారు.