India vs Pakistan : ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లో సందడి చేసిన నారా లోకేష్
India vs Pakistan : మ్యాచ్ ఎక్కడ జరిగినా, టికెట్లు దొరకడం ఎంత కష్టమైనా, ఖర్చు ఎంతైనా క్రికెట్ లవర్స్ వాటిని పట్టించుకోరు
- By Sudheer Published Date - 09:20 PM, Sun - 23 February 25

క్రికెట్ ప్రపంచంలో ఐసీసీ టోర్నీలు అంటే ప్రత్యేక ఆకర్షణ. అందులోనూ ఇండియా-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు నిజమైన పండగ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా, టికెట్లు దొరకడం ఎంత కష్టమైనా, ఖర్చు ఎంతైనా క్రికెట్ లవర్స్ వాటిని పట్టించుకోరు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు వాళ్ల సన్నాహాలు ముందుగానే మొదలైపోతాయి.

దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను భారత జెర్సీలో కుమారుడితో కలిసి ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఐసీసీ చైర్మన్ జై షాతో భేటీ అవ్వగా, రాష్ట్రంలో క్రీడలకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. విజయవాడ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని కూడా స్టేడియంలో సందడి చేశారు. ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కూడా ఆసక్తిగా వీక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హాజరయ్యారు. నారా లోకేష్, కేశినేని చిన్ని, దర్శకుడు సుకుమార్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు భారత జెర్సీలు ధరించి మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. నారా లోకేష్ కుమారుడితో కలిసి మ్యాచ్ చూడటం, టీమిండియాకు మద్దతుగా స్టేడియంలో సందడి చేయడం నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం విశేషం.