Lokesh Resignation : పార్టీ పదవికి లోకేష్ రాజీనామా?
జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడానికి నారా లోకేష్ సిద్ధం అయ్యారు.
- Author : Hashtag U
Date : 27-05-2022 - 5:56 IST
Published By : Hashtagu Telugu Desk
జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడానికి నారా లోకేష్ సిద్ధం అయ్యారు. ఆయన మహానాడు సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను ఇప్పటికే మూడు పర్యాయాలుగా పనిచేశానని, ఈ దఫా ఆ పదవి నుంచి తాను దిగిపోతానని చెప్పారు. తన రాజీనామాతో ఖాళీ కానున్న ఆ పదవిని ఇంకో నేతకు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ తరహాలోనే పార్టీలో 2 ప్లస్ 1 విధానం అమల్లోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం ప్రకారం ఏదేని పదవిలో ఒకే నేత రెండు సార్లు వరుసగా కొనసాగితే మూడో సారి ఆయనకు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఒంగోలు కేంద్రంగా శుక్రవారం ప్రారంభమైన మహానాడులో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. నేతలకు సుదీర్ఘ పదవులను రద్దు చేయాలంటూ తాను ఓ ప్రతిపాదన పెట్టానని లోకేశ్ తెలిపారు. నేతలకు సుదీర్ఘ కాలం పాటు పార్టీ పదవులు వద్దన్న కొత్త విధానం అమల్లోకి వస్తే, తన నుంచే ఆ కొత్త విధానాన్ని మొదలుపెట్టాలని కూడా తాను భావిస్తున్నానని లోకేశ్ తెలిపారు.
ఇక రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరన్న లోకేశ్… ఆయా స్థానాలకు సమర్థులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. అంతేకాకుండా వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిన నేతలకు నాలుగో పర్యాయం టికెట్ ఇవ్వరాదన్న దిశగానూ పార్టీలో కీలక చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు విస్పష్టతతో ఉన్నారని కూడా లోకేశ్ చెప్పారు.
వైసీపీ సర్కారు అవినీతిపైనా నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు ముగిసిన తర్వాత రెండు భారీ కుంభకోణాలను బయటపెడతానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగానే ఆయన రాజకీయాల నిర్వహణపైనా మాట్లాడారు. డబ్బుతో మాత్రమే రాజకీయాలు చేయలేమని ఆయన చెప్పారు. అదే సమయంలో డబ్బు లేకుండానూ రాజకీయాలు చేయలేమని కూడా లోకేశ్ చెప్పుకొచ్చారు.