TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి
ప్రభుత్వానిది ధనబలం ..తమది ప్రజాబలం అని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ -
- Author : Prasad
Date : 28-10-2023 - 6:37 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రభుత్వానిది ధనబలం ..తమది ప్రజాబలం అని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ – జనసేన విజయం తథ్యమన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారని.. 49 రోజులుగా ఒక్క రుజువు కూడా చూపించలేదన్నారు. పేదలకు పండుగ కానుకలు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపడం చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. నాడు మన రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే.. నేడు అవినీతి, దోపిడీలో నంబర్ వన్‌గా తయారైందన్నారు. తాను ఇక్కడకు చంద్రబాబు భార్యగానే కాదు.. ఒక భారత నారీగా నిజం గెలవాలని ఈ పోరాటం మీ ముందుకు తీసుకొస్తున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూడు రోజుల్లో ప్రజలోకి వచ్చాక తనపై టీడీపీ బిడ్డలు, ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానం, ప్రేమ నాకు శ్రీరామ రక్ష. అవే నాకు రక్షణ కవచమన్నారు. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవ ఇచ్చారని.. చంద్రబాబు ఆత్మవిశ్వాసం ఇచ్చారన్నారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు.. ఎప్పుడూ ప్రజలు, రాష్ట్ర అభివృద్ధికి కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిర్బంధించి 49 రోజులు అయిందన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతిన్నారని ప్రజలుకానీ, కార్యకర్తలు కానీ ఎవరూ నమ్మడం లేదన్నారు. 49 రోజులుగా ప్రభుత్వం ఒక్క రుజువు కూడా చూపించలేకపోయిందని.. మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని, తర్వాత రూ.371 కోట్ల అవినీతి అని, ఇప్పుడు రూ.27 కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నారని తెలిపారు. కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు రుజువులు లేవు..దీన్ని బట్టి చూస్తే ఇదీ ఈ ప్రభుత్వం చేసే అరాచకమేనన్నారు.
Also Read: BRS Public Meeting In Paleru : తుమ్మల వల్లే ఖమ్మంలో ఒక్క సీటు రాలేదు – పాలేరు సభలో కేసీఆర్ విమర్శలు