Naga Babu’s Swearing : నాగబాబు ప్రమాణ స్వీకారం ఈ వారంలోనేనా..?
Naga Babu's Swearing : ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రి ప్రమాణ స్వీకారానికి పెద్ద సమయం పట్టదు కాబట్టి.. ముఖ్యమంత్రి అనుకుంటే రేపే ఆ కార్యక్రమం పూర్తి చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు
- By Sudheer Published Date - 08:13 PM, Wed - 11 December 24

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో (Andhra Pradesh state politics) కీలక పరిణామం చోటు చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ నేత నాగబాబు(Nagababu)కు మంత్రి పదవి ఖరారైనట్లు గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన-తెదేపా పొత్తు తర్వాత మంత్రివర్గ విస్తరణలో జనసేన (Janasena)కు కూడా చోటు కల్పించాలని ఆలోచన చేసారు. ఈ నేపథ్యంలో నాగబాబు పేరు బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు, సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన పక్షాన సమర్ధవంతంగా పార్టీకి మద్దతు నిలబెట్టడంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. అలాంటి నాగబాబు కు మంత్రి పదవి కట్టబెట్టాలని కూటమి ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే విజయవాడ చేరుకున్న నాగబాబు ప్రమాణ స్వీకార తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలోనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం పదమూడో తేదీన చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనుండటంతో, ఈ రెండు రోజులు గడిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని అంత భావిస్తున్నారు. ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రి ప్రమాణ స్వీకారానికి పెద్ద సమయం పట్టదు కాబట్టి.. ముఖ్యమంత్రి అనుకుంటే రేపే ఆ కార్యక్రమం పూర్తి చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముహూర్తం నిర్ణయించాల్సింది నాగబాబు కనుక, ఆయన సూచన ప్రకారమే తేదీ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. మరో మంత్రి ప్రమాణ స్వీకారంపై రాజ్ భవన్ కి ఇంకా అధికారిక సమాచారం అందలేదని సమాచారం.
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉంది. సినీ నేపథ్యం కలిగిన నాగబాబుకు ఈ శాఖ బాధ్యతలు అప్పగిస్తే, మరింత ప్రయోజనం ఉంటుందని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. మరి నాగబాబు కు ఏ పదవి ఇస్తారు..? ఎప్పుడు ఇస్తారు..? అనేది చూడాలి.
Read Also : Heeramandi.. The Diamond Bazaar : 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్