Lavu Krishna Devarayalu : కేంద్రమంత్రితో MP శ్రీకృష్ణదేవరాయలు భేటీ..
Lavu Krishna devarayalu : NIPER వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా ఫార్మాస్యూటికల్ పరిశోధన, విద్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రంగా మారుతుందని
- By Sudheer Published Date - 07:49 PM, Mon - 4 November 24

టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Krishna devarayalu).. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా (Nadda)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో NIPER (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. NIPER వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా ఫార్మాస్యూటికల్ పరిశోధన, విద్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రంగా మారుతుందని, దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన నడ్డాకు వివరించారు. NIPER సంస్థ ద్వారా పరిశోధనలు, శిక్షణలతో పాటు ఫార్మా రంగంలో ఉన్నతస్థాయి నైపుణ్యాలు కల్గిన ప్రొఫెషనల్స్ తయారయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్రంలో మెడికల్ విద్యా వసతులను పెంచడం, విద్యార్థులకు మెడికల్ సీట్లను పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు. మెడికల్ విద్యార్థులు, వైద్య సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న యువతకు మరింత అవకాశం కల్పించేందుకు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచడం అత్యవసరమని చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కూలీలు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై కూడా దృష్టి సారించిన శ్రీకృష్ణదేవరాయలు, వీరికి ప్రస్థానానికి ముందుగా ఆరోగ్య పరీక్షలు చేసే సౌకర్యాన్ని అందించేందుకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమలో ప్రత్యేక ఆరోగ్య పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నడ్డాను కోరారు. ఈ పరీక్షా కేంద్రాలు వలస కూలీలకు సత్వరమైన ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా వారి ఆరోగ్య భద్రతకు మద్దతు అందిస్తాయని ఆయన వివరించారు.
Read Also : Purna Chandrasana: రోజూ 5 నిమిషాలు పూర్ణ చంద్రాసన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..!