Mahanadu 2025 : మహానాడు లో చంద్రబాబును ఆ వంటకాలను కోరిన మోడీ
Mahanadu 2025 : మోదీ సూచనను చంద్రబాబు కూడా ఆదరించి, మహానాడులో మూడు రోజుల పాటు తృణధాన్యాలతో తయారైన ప్రత్యేక వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది
- By Sudheer Published Date - 07:03 PM, Sun - 25 May 25

మహానాడు 2025 (Mahanadu)కార్యక్రమం నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రధాని నరేంద్ర మోదీ(Modi)తో భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం, చంద్రబాబు ప్రత్యేకంగా మోదీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సహకారంపై చర్చ జరిగిందని సమాచారం. అదే సమయంలో, టీడీపీ చేపట్టిన మహానాడు కార్యక్రమంపై మోదీ ఆసక్తి కనబరిచారు.
Tollywood : టాలీవుడ్ పెద్దలు కావాలని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారా..?
పార్టీ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుందని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహానాడు సందర్భంలో ప్రత్యేక సూచన చేశారు. మహానాడులో పాల్గొనే అతిథులకు తృణధాన్యాలతో తయారు చేసిన ఆరోగ్యకరమైన వంటకాలను వడ్డించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో తృణధాన్యాలు ఎంతో ఉపయోగకరమని, కేంద్రం కూడా వీటిని ప్రోత్సహిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు.
మోదీ సూచనను చంద్రబాబు కూడా ఆదరించి, మహానాడులో మూడు రోజుల పాటు తృణధాన్యాలతో తయారైన ప్రత్యేక వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తృణధాన్య వంటకాలపై నిపుణుల సహాయంతో ప్రత్యేక మెనూ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన ఆహారపు ప్రాధాన్యం కలిగించడమే కాకుండా, ప్రధాని సూచనలను పాటిస్తూ పార్టీ ప్రగతిని ప్రతిబింబించేలా ఉండే అవకాశం ఉంది.