yarlagadda venkatarao: ఆరోపణలు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
- Author : Vamsi Chowdary Korata
Date : 14-07-2026 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
గన్నవరం విమానాశ్రయ టెండర్ల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తల ఆందోళనను తెలియజేయడమే తన ఉద్దేశమని, తన వ్యాఖ్యలు ప్రభుత్వానికి లేదా పార్టీకి వ్యతిరేకంగా చేసినవి కాదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ మాట్లాడారు. సాక్షి సహా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ టెండర్‌ను తన అనుచరుడికి ఇప్పించేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.
రెండేళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్-ఛైర్మన్ హోదాలో తాను సమావేశానికి హాజరయ్యానని వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న పనులు, టెండర్లు, పెరుగుతున్న ఖర్చులపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రజాధనం వినియోగంపై వివరాలు అడగడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని, ఆ సమావేశంలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ పనితీరుపై ఏవైనా అసంతృప్తులు ఉంటే, వాటిని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, బహిరంగంగా తప్పుగా అర్థం చేసుకునేలా మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరుణంలో ఆయన వైసీపీ నాయకత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వివాదం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.