AP Liquor Case : రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డి తరలింపు
AP Liquor Case : వైసీపీ వర్గం మాత్రం మిథున్ రెడ్డి నిర్దోషి అని, ఆయనపై జరుగుతున్న దాడులు అన్ని రాజకీయ కారణాలేనని చెబుతోంది. "మిథున్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు" అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 05:58 PM, Sun - 20 July 25

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Case )లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy Arrest)ని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, గ్యాస్ట్రిక్, గుండె సంబంధిత మందులు తీసుకువెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఎంపీ హోదాలో ఉండటం వల్ల జైలులో ప్రత్యేక వసతులు కల్పించనున్నట్టు సమాచారం. ACB కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విచారణలు సాగనున్నాయి.
మిథున్ రెడ్డి అరెస్టు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. మిథున్, జగన్‌కు అత్యంత సమీపంగా ఉండటమే ఈ కేసు వెనుక అసలు కారణమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసి తన కుమారునిపై కుట్ర పన్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో తమ కుటుంబానికి ఉన్న రాజకీయ ఆధిపత్యాన్ని తట్టుకోలేకే ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Hydraa : హైడ్రా అంటే కూల్చివేతలే కాదు అభివృద్ధి కూడా – కమిషనర్ రంగనాథ్
ఇది మిథున్ రెడ్డిపై మొదటి ఆరోపణ కాదు. గతంలోనూ ఎయిర్‌పోర్ట్ మేనేజర్‌తో జరిగిన ఘటనలో కేసు నమోదు చేయబడింది. అయితే ఆ కేసు తప్పుడు కేసుగా తేలడంతో మిథున్ నిర్దోషిగా బయటపడ్డారు. అలాగే మదనపల్లె ఫైల్స్ పేరుతో వచ్చిన ఆరోపణలు కూడా నిరూపించలేకపోయారని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా ఎటువంటి అవినీతి నిరూపించలేని పరిస్థితిలో తాజాగా లిక్కర్ స్కామ్ పేరుతో మరోసారి ఆయనను రాజకీయంగా టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.
ఇక వైసీపీ వర్గం మాత్రం మిథున్ రెడ్డి నిర్దోషి అని, ఆయనపై జరుగుతున్న దాడులు అన్ని రాజకీయ కారణాలేనని చెబుతోంది. “మిథున్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు” అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో మిథున్‌కు మద్దతు ఉన్న నేపథ్యంలో ఈ అరెస్ట్ టీడీపీ కూటమికి దిమ్మ తిరిగే నిర్ణయంగా మలచుకుంటుందా లేదా అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాలపై ఆధారపడనుంది. మొత్తం మీద మిథున్ రెడ్డి అరెస్ట్ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను కలిగించాయి.