TDP Website Mistakes : అమ్మో! టీడీపీ బ్లాగు..బండబూతులు!!
తెలుగు వాళ్లకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని చాటిన పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు భాషకు వన్నెతెచ్చిన సందర్భాలు అనేకం. తెలుగు జాతి ప్రాముఖ్యతను, తెలుగు ఔచిత్యాన్ని చాటిచెప్పే పార్టీ తెలుగుదేశం.
- By CS Rao Published Date - 12:19 PM, Thu - 6 January 22

తెలుగు వాళ్లకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని చాటిన పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు భాషకు వన్నెతెచ్చిన సందర్భాలు అనేకం. తెలుగు జాతి ప్రాముఖ్యతను, తెలుగు ఔచిత్యాన్ని చాటిచెప్పే పార్టీ తెలుగుదేశం. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా అన్న ఎన్టీఆర్ ఉండే వారు. ఆయన తెలుగు ప్రసంగాలంటే అభిమానులు చెవి కోసుకుంటారు. ఆయన వారసుడిగా చంద్రబాబు మూడు దశాబ్దాల నుంచి పార్టీని నడుపుతున్నాడు. తెలుగువారి ఆత్మవిశ్వాసం ప్రపంచానికి చంద్రబాబు చాటారని ప్రతి వేదికపైనా ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కానీ, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న బ్లాగును చదివితే..తెలుగు భాష మీద ఆ పార్టీకి ఉన్న పట్టు ఏమిటో స్పష్టం అవుతోంది. తెలుగు భాషను కించపరిచేలా ఆ బ్లాగు ఉండడం గమనార్హం.అధికారికంగా నిర్వహిస్తోన్న ఆ బ్లాగులోని తెలుగు పదాలు, అక్షరాలు, వాక్య నిర్మాణం గమనిస్తే తెలుగు భాష మీద ఆ పార్టీకి ఉన్న చిత్తుశుద్ధి ఏమిటో అర్థం అవుతోంది. జన్మభూమి, కన్నతల్లి, మాతృభాషను ఎన్నడూ మరవకూడదు. అందుకే జన్మభూమి లాంటి కార్యక్రమాలను చంద్రబాబు అధికారంలో ఉండగా చేపట్టారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాడు. మాతృ భాష కోసం అసెంబ్లీ లోపల, బయట తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇంగ్లీషు బోధన ప్రవేశపెట్టాడు. ఆ విషయంపై ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిస్పందించింది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని నినదించింది. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసింది. తెలుగు భాషను అంతం చేసేలా జగన్ నిర్ణయాలు ఉన్నాయని ధ్వజమెత్తింది.తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని, సామాజిక అంశాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం కోసం బ్లాగును ఆ పార్టీ నిర్వహిస్తోంది. అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు కూడా పనిచేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ గ్రంథాలయం చాలా పెద్దగా ఉంటుంది. పలువురి ప్రసంగాలు, తెలుగు భాషకు సంబంధించిన నిఘంటువులు, మేనిఫెస్టోలు, రాజకీయపరమైన అంశాలను తెలియచేసే పుస్తకాలు, దినపత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రను తెలిచేసే పుస్తకాలు..పుష్కలంగా గ్రంథాలయంలో భద్రపరుస్తారు. వాటిని కార్యకర్తలు, నాయకులు ఎప్పుడూ ఆ గ్రంథాలయంలో చదువుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ గ్రంథాలయంలో దాదాపు అన్ని పుస్తకాలు లభిస్తాయి. అంతటి గొప్ప గ్రంథాలయాన్ని దశాబ్దాల నుంచి ఆ పార్టీ నిర్వహిస్తోంది.
తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని, విధి విధానాలను తెలియచేయడానికి ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులు జరుగుతుంటాయి. వివిధ రంగాల్లోని నిపుణులతో పాటు తెలుగు పండితులు కూడా ఆ తరగతులకు వస్తుంటారు. కార్యకర్తల్లోని సామర్థ్యాన్ని వెలికితీయడానికి శిక్షణ ఇస్తుంటారు. అలా తయారు అయిన లీడర్ల జాబితాలో చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి ప్రస్తుత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ తో పాటు ఇప్పుడు తరచూ మీడియా ముందుకొస్తోన్న పట్టాభి, వర్లరామయ్య లాంటి వాళ్లు వందల మంది తెలుగుదేశం శిక్షణలో తర్ఫీదు పొందిన వాళ్లే. అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న గ్రంథాలయం నుంచి తయారైన బ్లాగు ఆ పార్టీని నవ్వులపాలు చేస్తోంది.ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా బ్లాగు, ఈ పేపర్, యాప్ తదితరాలతో సోషల్ మీడియాపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. వాటిని నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుందని తెలుస్తోంది. కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆ వేదికపై పనిచేస్తుంటారు. కొందరు రచయితలు కూడా అక్కడ పనిచేస్తుంటారు. తెలుగు మీద పట్టున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ, ఆ పార్టీ నిర్వహిస్తోన్న బ్లాగును చదవితే..తెలుగుదనం ఎక్కడా కనిపించదు. బండబూతులు ఆ బ్లాగులో కనిపిస్తాయి. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు గురించి రాసిన భాషను అర్థం చేసుకోవడం తెలుగువాళ్లకు కూడా కష్టమే. ఇక భాషాభిమానులు ఆ బ్లాగును చదివితే..ఒట్టే.!