Kodali Nani Challenge : ‘కొడాలి’ ది గ్రేట్ ఎస్కేప్
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని ప్రత్యర్థులకు రెండు అవకాశాలు ఇచ్చాడు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు ప్రారంభించాడని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక సవాల్ చేశాడు.
- By Hashtag U Published Date - 10:53 AM, Sat - 22 January 22

మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని ప్రత్యర్థులకు రెండు అవకాశాలు ఇచ్చాడు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు ప్రారంభించాడని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక సవాల్ చేశాడు. ఇక గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ కేంద్రంలో కాసినో, జూదం జరిగిందని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా అని శపథం చేసాడు. ఒక వేళ నిరూపించలేకపోతే ప్రత్యర్దులు ఏమి చేస్తారో..చెప్పాలని బూతు రేంజిలో చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరాడు. ఆయన విసిరిన ఆ రెండు సవాళ్ళతో ప్రత్యర్దులు చేస్తున్న ప్రచారం నిజమా? అబద్దమా? అనే సందిగ్ధం నెలకొంది.సంక్రాంతి రోజున గుడివాడలో జరిగిన కాసినో కల్చర్ హడావిడి వీడియోలో కనిపించింది. సోషల్ మీడియాలో వాటిని చూసిన వాళ్ళు ఔరా ..ఇదేమి చోద్యం అనుకున్నారు. పోలీసులు ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కానీ పోలీస్ రికార్డ్ ల ప్రకారం కాసినో పై ఒక కేసు కూడా నమోదు కాలేదు. మంత్రి ఆ రోజున ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొందరు జూదరులను అరెస్ట్ చేసారు. ఇదీ అక్కడ కనిపిస్తున్న ఆన్ రికార్డ్ సంగతి.
టీడీపీ నిజానిర్ధారణ కమిటీ మాత్రం ఆధారాలను చూపిస్తాం అంటుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారం అందివ్వలేదు. కొడాలి కన్వెన్షన్ కు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి అని కోరుతుంది. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ నాయకులను కన్వెన్షన్లోకి అడుగుపెట్టనివ్వను అని కొడాలి వార్నింగ్ ఇచ్చాడు. నిజానిర్ధారణకు స్థానిక ప్రజలు, పోలీసులు వెళ్లొచ్చని అంటున్నాడు. ఈ క్రమంలో కొడాలి కన్వెన్షన్ లో సంక్రాంతి రోజు ఏమి జరిగిందో..పోలీసులు నిర్ధారించాలి. కాసినో జరగలేదని రిపోర్ట్ ఇచ్చినా..దాన్ని టీడీపీ నమ్మదు. ప్రభుత్వానికి పోలీసులు అమ్ముడు పోయారని చాలా కాలంగా ఆ పార్టీ భావిస్తుంది. పైగా పోలీసులు, మంత్రి కొడాలి కలిసి కాసినో ఆడించారు అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలి. కానీ , ఆ సంస్థలు ఇప్పటికే ఉన్న కేసులను బయటకు తీసుకు రాలేకపోతున్నాయి. ఆ జాబితాలో కోడికత్తి, బాబాయి హత్య, విశాఖ డాక్టర్ కేసు, అమరావతి, జడ్జి లపై అనుచిత వ్యాఖ్యలు తదితరాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు గుడివాడ కాసినో..కేసును కేంద్ర సంస్థలు తీసుకోవడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. స్థానిక పోలీసులు గుడివాడలో కాసినో ..జరిగింది అని చెప్పటం అసాధ్యం. సో..కొడాలి నాని ఛాలెంజ్ తేలేది కాదు.
ఇక హైదరాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభం అయింది. ఆనాడు ఇందిరాగాంధీ పేరు విమానాశ్రయం కు పెట్టింది కూడా ఆయనే. డొమెస్టిక్ ఏయిర్పోర్టుకు ఐనా ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని ఆనాడు టీడీపీ అసెంబ్లీలో డిమాండ్ చేసింది. దానికి కూడా కాంగ్రెస్ ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బేగం పేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ఆనాడు వేడుకుంది. అది కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరమరుగు అయింది. సో..చంద్రబాబు హైదరాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు అనడానికి అవకాశం లేదు. కొడాలి చాలా తెలివిగా ప్రారంభం గురించి మాత్రమే ప్రస్తావించాడు. దానికి ముందు చంద్రబాబు చేసిన ప్రయత్నం మీద ఛాలెంజ్ చేయలేదు. సో..కొడాలి చేసిన ఈ సవాల్ కూడా వ్యూహాత్మకం.
వాస్తవంగా హైద్రాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్లాన్ అంతా చంద్రబాబు మైండ్ నుంచి వచ్చిందే. ఆ విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ ని అడిగితే చెబుతాడు. ఎందుకంటే మెట్రో లేట్ కావడానికి ఆ రోజు టీఆర్ఎస్ చేసిన యాగీ అందరికి తెలుసు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు కొన్ని వందల సార్లు సమావేశాలు పెట్టాడు. ఇక హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఆరోజున చంద్రబాబు పడిన తపన తెలంగాణ సిఎం కేసీఆర్ కు తెలుసు. అక్కడి భూముల సమీకరణ ఎలా జరిగిందో..ఆయనకు బాగా తెలుసు. ఎయిర్పోర్ట్ కోసం నిద్రలేని విధంగా చంద్రబాబు మీటింగ్ లతో అధికారులను చంపాడు. ఆరోజు ఉన్న అధికారులు చంద్రబాలు చేసిన ప్రయత్నం గురించి చెబుతారు. దివంగత వైఎస్సార్ ఆత్మను అడిగితే ఇంకా బాగా చెప్పగలడు. ఇదంతా కొడాలి కి తెలియని విషయం కాదు. అందుకే ఎయిర్పోర్ట్ ప్రారంభం గురించి మాత్రమే మాట్లాడాడు. సో..ఈ ఛాలెంజ్ లోనూ కొడాలి రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాల్సిన పని లేదు. మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ అసలు విషయాల్ని పక్కదోవ పట్టించడం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ట్రాప్ లో టీడీపీ తో పాటు ఒక భాగం మీడియా , విపక్షాలు పడుతున్నాయి. అంతిమం గా ప్రభుత్వం , పార్టీలు గెలుస్తున్నాయి. ప్రజలు ఓడిపోతున్నారు. ఇప్పడు మంత్రి కొడాలి విసిరిన ఛాలెంజ్ లు కూడా మైండ్ గేమ్ లో భాగం. వాటిని ఎవరు నిరూపించ లేరు. జస్ట్ టైం పాస్ అంతే!