Mega Plan : కేసీఆర్ తరహాలో పవన్! బీఆర్ఎస్ తో జనసేన పొత్తు?
కేసీఆర్ వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు.
- By CS Rao Published Date - 12:50 PM, Sat - 24 December 22

తెలంగాణ సెంటిమెంట్ తో రాజ్యాధికారాన్ని కేసీఆర్ సాధించారు. సరిగ్గా ఆయన వ్యూహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్(Mega Plan) అనుసరిస్తున్నట్టు ఉన్నారు. ఒకటిన్న దశాబ్దం పాటు పైసా ఖర్చు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్(KCR) నడిపారు. దాని వలన ఆయనకు చేకూరిన లబ్ది ఉద్యమకారులకు బాగా తెలుసు. ఇప్పుడు జనాలకు కూడా తెలిసింది. సేమ్ టూ సేమ్ కేసీఆర్ మాదిరిగా ఎనిమిదేళ్ల నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా టీఆర్ఎస్ పార్టీని పొత్తులతో పెంచుకుంటూ వచ్చారో, అదే తరహాలో జనసేన పార్టీని ఎనిమిదేళ్లుగా లైవ్ లో ఉంచుతూ వస్తున్నారు పవన్. కాకపోతే, కేసీఆర్ సెంటిమెంట్ ను నమ్ముకుంటే, పవన్ సామాజికవర్గాన్ని, సినిమా గ్లామర్ ను నమ్ముకున్నారు.
రాజ్యాధికారానికి దగ్గరయినట్టు పవన్ ఫీల్ (Mega plan)
ఇప్పుడు రాజ్యాధికారానికి దగ్గరయినట్టు పవన్ ఫీల్ అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సీఎం కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యూహాన్ని(Mega plan) తనకు వదిలేయండంటూ క్యాడర్ కు ఇటీవల దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన వ్యూహం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తాజాగా హైదరాబాద్ రాజకీయ వర్గాల్లోని టాక్. ఎవరూ అడగకుండానే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జనసేన మద్ధతు ప్రకటించింది. తెలంగాణలో పుట్టేంత అదృష్టం చేసుకోలేదని ఒకానొక సందర్భంలో పవన్ వ్యాఖ్యానించారు. కులాల కుమ్ములాటలతో కొట్టుకు చస్తున్నారంటూ ఏపీ ప్రజలను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎంత దగ్గరగా ఉన్నారో అర్థం అవుతోంది.
పలు సందర్బాల్లో కేసీఆర్(KCR) పాలనను జనసేనాని పవన్ ప్రశంసించారు. ఇటీవల బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హీరోలందరి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరో పవన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత క్రేజీ హీరో పవన్ అంటూ ప్రశంసలు కురిపించారు. అంటే, కల్వకుంట్ల కుటుంబానికి, పవన్ కు మధ్య ఏదో నడుస్తుందన్న సంకేతాలు టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. ఎనిమిదేళ్ల కాలంలో ఎప్పుడూ పవన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. పైగా వీలున్నప్పుడల్లా ప్రశంసిస్తూ వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని అందరికీ తెలుసు. అయినప్పటికీ పవన్ తెలంగాణ సీఎం కేసీఆర్ పక్షాలన నిలుస్తుంటారు.
తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తామని పవన్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తుతో నడవాలని పవన్ ప్రయత్నించారు. కానీ, అధ్యక్షుడు బండి సంజయ్ దూరంగా పెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ జనసేన పార్టీని దగ్గరకు రానివ్వలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ అడగకుండానే మద్ధతు ఇస్తున్నట్టు జనసేన ప్రకటించింది. రాబోవు ఎన్నికల్లో 30 స్థానాల్లో తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తామని పవన్ ఇటీవల వెల్లడించారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగా వెళుతుందా? అనేది తేలాల్సి ఉంది. పొత్తులతో ఎదిగిన టీఆర్ఎస్ పార్టీ మాదిరిగా రెండు రాష్ట్రాల్లోనూ కీలక శక్తిగా జనసేన అవతరించాలని పవన్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ పార్టీతో కలిసి పవన్ పొత్తు పెట్టుకోవడానికి సంప్రదింపులు చేస్తున్నట్టు తాజా టాక్. అయితే, తెలంగాణలో కూడా కొన్ని స్థానాలను ఇస్తే ఏపీలో పొత్తుకు సై అనేలా పవన్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి జనసేన ఉంది. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే, వచ్చే ఫలితం ఏమిటో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక చెప్పేసింది. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ స్కెచ్ వేశారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అయితే, సీఎం పదవిని ఆశిస్తోన్న పవన్ వాలకాన్ని గమనించిన టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
Also Read : Pawan Kalyan: పొత్తుపై అదే ఆప్షన్!వారాహి ఆగదు!!
ఒకవేళ టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు దిగితే, బీఆర్ఎస్ పార్టీని జనసేన నమ్ముకుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొందరు లీడర్లతో బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుగుతోంది. గతంలో కాపు, బీసీ కాంబినేషన్లో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొత్త పార్టీని పెట్టాలని యోచించారు. ఆ బ్యాచ్ ను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. వెలమ, కాపు ఈక్వేషన్ తో జనసేన, బీఆర్ ఎస్ కూటమి కట్టాలని కొందరు సూచిస్తున్నారట. ఆ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.
ఏపీలో ఎంట్రీకి బీఆర్ఎస్ పార్టీ జనసేనతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. గత కొంత కాలంగా పవన్ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తుతూ కల్వకుంట్ల కుటుంబం ప్రమోట్ చేయడం వెనుక అదే వ్యూహం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. టీఆర్ ఎస్ టూ బీఆర్ఎస్ వరకు ఎదిగిన కేసీఆర్ మాదిరిగా పవన్ కూడా మైండ్ గేమ్, సెంటిమెంట్ ను నమ్ముకుని అధికారంలోకి వచ్చేలా వ్యూహాలను రచిస్తున్నారని జనసేన అంతర్గత వర్గాల్లోని వినికిడి. కేసీఆర్, పవన్ పార్టీల కూటమి వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పెద్దలు ఉన్నారని మరో వాదన కూడా ఉంది. మొత్తం మీద చంద్రబాబు టార్గెట్ గా అన్ని కోణాలను ప్రత్యర్థులు రంగరిస్తున్నారు. ఇటీవల ఆయన సభలకు వస్తోన్న జనాన్ని చూస్తే ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలు వేసినా ఫలించేలా కనిపించడంలేదు.