Balineni Srinivasa Rao : మాజీ మంత్రి బాలినేని రూ. 1,734 కోట్ల స్కామ్
- By CS Rao Published Date - 05:11 PM, Sat - 9 April 22

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి అవినీతి, భూ కుంభకోణాలను టీడీపీ బయటపెట్టింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పూర్తి వివరాలను మీడియా ముందు పెట్టారు. హవాలా నుంచి వివిధ రూపాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ సంపాదన గురించి వివరించారు.గత మూడేళ్లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ.1,734 కోట్ల అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల నుంచి, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల కోసం రూ.495 కోట్ల అక్రమ కమీషన్లు వసూలు చేశారని అన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు, డంపింగ్ యార్డుల యజమానులు, లారీ కాంట్రాక్టర్ల నుంచి రూ.905 కోట్లు వసూలు చేసిన బాలినేని ఇసుక మాఫియా ద్వారా రూ.100 కోట్లు, గ్రావెల్ మాఫియా ద్వారా రూ.40 కోట్లు దండుకున్నారని బయటపెట్టారు.
ఒంగోలు పట్టణంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియా నుంచి రూ.187 కోట్ల భారీ కమీషన్లు వసూలు చేశారని మండిపడ్డారు. బినామీలను ఉపయోగించుకుని ఈ మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. లెటర్‌హెడ్ స్కామ్‌తో అతని మితిమీరిన చర్యలు ప్రారంభమయ్యాయి. హవాలా మనీ కుంభకోణం ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో తాజాగా ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో పీక్ అవర్స్‌లో యూనిట్‌కు రూ.6కి పీపీఏలు పొందితే, జగన్ హయాంలో పీక్ అవర్ విద్యుత్ యూనిట్ రూ.22కు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇది ఈఆర్‌సీ ప్రకటనల ప్రకారం మాత్రమే. జగన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో జె-ట్యాక్స్ వసూలు చేస్తే, మాజీ మంత్రి బాలినేని ప్రకాశం జిల్లాలో బి-ట్యాక్స్ వసూలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిన విద్యుత్ కోతలు, పెరిగిన విద్యుత్ ఛార్జీలకు బాలినేని బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఇంధన శాఖ మంత్రి బాలినేనికి ఉన్న బంధుత్వాన్ని దుర్వినియోగం చేసి అడ్డూఅదుపూ లేకుండా మోసాలకు పాల్పడ్డారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇసుక, మైనింగ్, గ్రానైట్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాలో బాలినేని, ఆయన అనుచరులు ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సోలార్ కంపెనీలతో కుదుర్చుకున్న పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని తప్పుపట్టారు. ‘విద్యుత్ సంస్థల నుంచి కమీషన్లు దండుకోవడం కోసమే వైఎస్‌ఆర్‌సీపీ పాలన రాజకీయ కోణంలో ప్రతీకార విధానాన్ని అవలంబించింది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. మొత్తం మీద వివిధ రూపాల్లో వేల కోట్లు బాలినేని దండుకున్నాడని ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.