Ponduru Khadi- Mahatma Gandhi : పొందూరు ఖాదీ అంటే గాంధీజీకి మహా ఇష్టం.. ఎందుకు ?
Ponduru Khadi- Mahatma Gandhi : స్వాతంత్ర్య దినోత్సవ వేళ మన జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకోవడం తప్పనిసరి..దేశాన్ని ఏకం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది..
- By Pasha Published Date - 08:20 AM, Sat - 12 August 23

Ponduru Khadi- Mahatma Gandhi : స్వాతంత్ర్య దినోత్సవ వేళ మన జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకోవడం తప్పనిసరి..
దేశాన్ని ఏకం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది..
ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పొందూరుతో గాంధీజీకి ఉన్న బంధం గురించి తెలుసుకుందాం..
గాంధీజీకి పొందూరు ఖాదీ అంటే మహా ఇష్టం..
మన జాతిపిత అంతగా ఇష్టపడిన ఆ ఖాదీ గురించి కొన్ని విశేషాలు..
Also read : Weavers Of Ponduru : ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సిక్కోలు నేత కార్మికులు
పొందూరులోని ప్రతి గడప నుంచి మగ్గం శబ్దం లయబద్దంగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటి ముందు చరఖా తిరుగుతూనే ఉంటుంది. దేశంలోనే అత్యంత సన్నని నూలుపోగును ఇక్కడి నేత కార్మికులు తయారు చేస్తారు. దీన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఇష్టపడుతారు. స్వదేశీ ఉద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఆయన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి నేత వస్త్రాల తయారీ, నాణ్యత తదితర వివరాలతో పాటు పొందూరు ఖాదీని గాంధీజీకి అందించారు. వాటి నాణ్యతను చూసిన గాంధీజీ ఆశ్చర్యపోయి పొందూరు ఖాదీ ప్రత్యేకతపై తన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాంతో పొందూరు ఖాదీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో..
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో దేశవ్యాప్త పర్యటనల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పొందూరుకు పది కిలోమీటర్లు దూరంలో ఉన్న దూసి రైల్వే స్టేషన్‌లో గాంధీజీ 15 నిముషాలు ఆగారు. ఆయనను చూసేందుకు వెళ్లిన వారిలో కొందరు పొందూరు ఖాదీ వస్త్రాలను బహుకరించారు. పొందూరులోని ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ప్రాంగణంలో ఏర్పాటైన గాంధీ విగ్రహాన్ని గాంధీ మనుమరాలు తారా భట్టాచార్జీ గాంధీ 1997లో ఆవిష్కరించారు. తారా భట్టాఛార్జీ గాంధీ పొందూరులో మూడుసార్లు పర్యటించారు. పొందూరు ఖాదీ పరిశ్రమ, తయారీ విధానం వంటి వివరాలతో పొందూరు ఖాదీ చరిత్రపై డాక్యుమెంటరీ రూపొందించారు. ”ఖాదీ గంగానదైతే పొందూరు ఆ గంగకి జన్మనిచ్చిన గంగోత్రి. గాంధీయే ఖాదీ…ఖాదీయే గాంధీ. చేతి నేతతో నాణ్యమైన ఖాదీని తయారు చేస్తూ మహాత్మగాంధీకి పొందూరు నిత్యం నివాళ్లు అర్పిస్తూనే ఉంది. గాంధీజీ కలలుగన్న మహిళ సాధికారత, ఖాదీ భారతం పొందూరులో కనిపిస్తుంది. పొందూరు ఖాదీ కేవలం వస్త్రం మాత్రమే కాదు…ఇక్కడ జరుగుతున్న చేతి పని నిజాయితీకి నిదర్శనం” అని పొందూరులో గాంధీజీ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా తారా భట్టాఛార్జీ ప్రసంగించారు. ఇలా గాంధీజీ కుటుంబానికి, పొందూరుకు విడదీయరాని బంధం ఉంది.
Also read : Today Horoscope : ఆగస్టు 12 శనివారం రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక గొడవలు, ఆకస్మిక ధనలాభం
‘100 కౌంట్’ పొందూరు స్పెషల్
- దేశంలో ఖాదీ కమిషన్ సర్టిఫై చేసిన 2 వేల వరకూ ఖాదీ పరిశ్రమలున్నా, పొందూరు ఖాదీ ప్రత్యేకతే వేరు. ఇక్కడ తయారయ్యే ఫైన్ ఖాదీ మరెక్కడా తయారు కాదు. అత్యంత సన్నని పోగుతో ఇక్కడి వస్త్రాలను తయారు చేస్తారు. దీనినే ‘100 కౌంట్’ అంటారు.
- రెడ్ కాటన్‌తో తయారు చేసే వస్త్రాలకు 48 నుంచి 63 వరకు, హిల్ కాటన్ (కొండపత్తి)తో తయారు చేసే వస్త్రాలకు 71 నుంచి 100 వరకు నాణ్యతను బట్టి కౌంట్ ఇస్తారు. వంద కౌంట్ వచ్చిన దారాన్నే 100 కౌంట్ సన్నపోగు అంటారు.
- పొందూరులో సన్నపోగు దారంగా మారి మగ్గానికి చేరే ముందు 8 దశల్లో కొండపత్తి (పత్తిలో ఒక రకం) శుద్ధి అవుతుంది. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్త బరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం అనేవి ఈ ఎనిమిది దశలు. ఇవన్నీ కూడా అత్యంత నాణ్యమైన సన్నపోగుదారాన్ని తయారు చేయడానికే. అంతకు మించి సన్నని దారాన్ని ఇక తయారు చేయలేం.
- వాలుగ చేప ముల్లుతో ఏకిన పత్తితోనే నూరు కౌంట్ దారాన్ని తయారు చేయగలం. ఈ చేపముల్లే నాణ్యమైన ఖాదీ తయారీకి మూలస్తంభం. వాలుగ చేప పైదవడ, కింది దవడల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఈ దవడలను నాలుగు భాగాలుగా విభజించి…తర్వాత వాటిని అరచేతి పొడవంత కర్రలను కట్టి…దానితోనే ముడి పత్తిని శుభ్రం చేస్తారు. వాలుగ చేప తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లభిస్తుంది. అక్కడి నుంచి ఈ చేప ముల్లును కొని తీసుకుని వస్తారు.