Srisailam : పూజారి ఇంట్లోకి చిరుత
Srisailam : పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ (Satyanarayana) ఇంటి ఆవరణలో చిరుత పులి ప్రవేశించింది
- By Sudheer Published Date - 03:27 PM, Mon - 6 January 25

తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల (Leopards) సంచారం భయాందోళనలకు కారణమవుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చిరుత కదలికలు మళ్లీ కలకలం రేపాయి. శ్రీశైలం దేవస్థానం(Leopard Srisailam Temple)లో పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ (Satyanarayana) ఇంటి ఆవరణలో చిరుత పులి ప్రవేశించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి ఇంట్లో అర్థరాత్రి సంభవించిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ సంఘటనతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు చిరుత కదలికలపై నిశితంగా గమనిస్తూ, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత ఎటువైపు వెళ్ళిందనే అంశంపై వారు ఆరా తీస్తున్నారు. శ్రీశైలం ప్రాంతంలో చిరుత సంచారం ఇదే మొదటిసారి కాదు, ఇలాంటి ఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అటు కృష్ణా జిల్లాలోనూ చిరుత పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గన్నవరం మండలంలోని మెట్లపల్లి వద్ద ఆదివారం చిరుత పిల్లలతో కలిసి రోడ్డు దాటడం ఆర్టీసీ కండక్టర్ గమనించాడు. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మెట్లపల్లి ప్రాంత ప్రజలు పొలం పనులకు వెళ్ళడానికే జంకుతున్నారు.
Formula E-Car race : ఫార్ములా ఈ-కార్ రేసు..పలు కీలక విషయాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం
అలాగే అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోనూ చిరుత పులి సంచారం భయాన్ని పెంచుతోంది. ఓ రైతు పొలంలో ఆవు దూడలపై చిరుత దాడి చేసి చంపడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారంపై ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారానికి సంబంధించిన వార్తలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది. చిరుతల కదలికలను నియంత్రించేందుకు అటవీశాఖ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
శ్రీశైలం పాతాళ గంగ మెట్ల దారిలో చిరుత కలకలం.. #srisailam #Cheetah #HashtagU pic.twitter.com/gSiPCXIoUk
— Hashtag U (@HashtaguIn) January 6, 2025