AP MLC Graduate Elections: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు రేపే చివరి తేది
ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్‌లో ఏపీ సీఈవో వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే, ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేపించి, ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.
- By Kode Mohan Sai Published Date - 04:54 PM, Tue - 5 November 24

AP MLC Graduate Elections: ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సందర్భంగా, అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీ వరకు తమ ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది.
ఉభయ గోదావరి జిల్లాలలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో పట్టభద్రుల నుండి ఫారం-18 ద్వారా ఓటుకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక, నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు అర్హుల నుండి మరోసారి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ దరఖాస్తులపై డిసెంబర్ 25 న స్క్రూటినీ (తపాసు) పూర్తి చేయబడుతుంది, ఆపై డిసెంబర్ 30న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అనంతరం, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటు నమోదు – ముఖ్యమైన సూచనలు:
పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫారం-18 ద్వారా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు, ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది:
1. డిగ్రీ సర్టిఫికేట్ నకలు: గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించబడిన డిగ్రీ సర్టిఫికేట్ నకలు జత చేయాలి.
2. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు: రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఫారం-18పై అతికించాలి.
3. అధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికేట్, ఓటర్ ఐడీ: ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికేట్, ఓటర్ ఐడీ జిరాక్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తులను అన్ని కలెక్టరేట్‌లు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఈవో ఆఫీసులు వద్ద స్వీకరిస్తారు.
అలాగే, ఓటర్ల నమోదు ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
పట్టభద్రుల ఓటు నమోదు ఆన్‌లైన్ విధానం:
గ్రాడ్యూయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
1. హోమ్ పేజీ లోని MLC-e Registration ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
2. తరువాత, గ్రాడ్యూయేట్-18 ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. ఓటర్ ప్రాథమిక వివరాలతో Sign-Up చేయండి.
4. అప్పుడు ఫారం-18 పై క్లిక్ చేయండి.
5. ఏ గ్రాడ్యూయేట్ నియోజకవర్గం కింద వస్తారో, ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోండి.
6. ఓటర్ పూర్తి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.
7. అవసరమైన విద్యార్హత పత్రాలు, ఫొటోలు మరియు సంతకం అప్‌లోడ్ చేయండి.
8. చివరగా, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే, అప్లికేషన్ పూర్తయి రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
వీటిని ఎలా ట్రాక్ చేయాలి?
జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీరు మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు అనంతరం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ఓటర్ల వివరాలు వీఆర్వో వద్దకు పంపబడతాయి.
ఈ దరఖాస్తుదారులు తమ డిగ్రీ, ఎస్ఎస్సీ, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్ లను గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి వీఆర్వోకు అందజేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులు:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వారు, తమ పత్రాలు మరియు ఫారం-18 ను ఎమ్మార్వో ఆఫీసులో పెట్టిన బాక్స్ లో వేయవచ్చు.
గమనిక: ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ దరఖాస్తులకు సంబంధించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి.