Lokesh Padyatra: లోకేష్ పాదయాత్రకి కర్ణాటక పోలీసుల రక్షణ
నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుమతులు, బందోబస్తు కోసం టిడిపి డిజిపి నుంచి డిఎస్పీ వరకూ అనేక వినతులు పంపింది.
- By CS Rao Published Date - 08:48 PM, Sun - 29 January 23

Lokesh Padyatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుమతులు, బందోబస్తు కోసం టిడిపి డిజిపి నుంచి డిఎస్పీ వరకూ అనేక వినతులు పంపింది. ఏపీ సర్కారు ఆదేశాలున్నాయేమో కానీ పోలీసుల స్పందన లేదు. పాదయాత్ర ఆరంభించక ముందు నుంచే ఏపీ పోలీసులు రకరకాల ఆంక్షల పేరుతో ఆపాలని చూశారు. అశేషప్రజా మద్దతుతో యువగళం ఆరంభమైంది.
రక్షణ కల్పించాల్సిన ఏపీ పోలీసులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మూడు రోజులుగా సాగుతుంటే, ఏపీ పోలీసులు నామ్ కే వాస్తేగా బందోబస్తు చేపట్టారు. మొత్తం టిడిపి వలంటీర్లు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, అభిమానులే రక్షణ వలయంగా లోకేష్ వెన్నంటి నడుస్తూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో కర్ణాటక సరిహద్దు గ్రామాలున్నాయి. ఈ ఏరియాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిసి, ఎటువంటి బందోబస్తు టిడిపి అడగకపోయినా..కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రకి భారీ భద్రత కల్పించింది.
కుతేగాని గ్రామం వద్దకు చేరుకున్న కర్ణాటక డిఎస్పీ, రోప్ పార్టీ, కానిస్టేబుళ్లు యువగళం పాదయాత్రకి చాలా క్రమశిక్షణగా భద్రత కల్పించారు. లోకేష్ చుట్టూ వలయంగా ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర కొనసాగేలా చూస్తున్నారు. అక్కడే ఉన్న ఏపీ పోలీసులు సినిమా చూస్తున్నట్టు, తమకు సంబంధంలేని భద్రత అన్నట్టు ప్రేక్షకపాత్ర పోషించారు.