Debt : కూటమి సర్కార్ అప్పులపై జగన్ కామెంట్స్
Debt : వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పుల్లో సగాన్ని మాత్రమే తీసుకున్నారని, కానీ చంద్రబాబు ఒకే ఏడాదిలోనే ఆ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు
- By Sudheer Published Date - 01:51 PM, Thu - 26 June 25

కూటమి సర్కార్ (Kutami Govt) అప్పలపై జగన్ స్పందించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా అధిక వడ్డీలపై తీసుకుంటున్న అప్పుల వల్ల ఏటా రూ.235 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఈ విధమైన చర్యలపై నోటీసులు జారీ చేసినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రూ.5,526 కోట్ల బాండ్లను జారీ చేసి అప్పులు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆరోపించారు.
జగన్ చేసిన ఆరోపణల ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించడమే కాకుండా, ఏపీఎండీసీకి చెందిన రూ.1,91,000 కోట్ల విలువైన గనులను రూ.9,000 కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) ఉల్లంఘనకు దారితీస్తుందని, ఈ విధానం ద్వారా నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో రాష్ట్ర ప్రజలెదురుగా చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పుల్లో సగాన్ని మాత్రమే తీసుకున్నారని, కానీ చంద్రబాబు ఒకే ఏడాదిలోనే ఆ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పాలనకే పరిమితమైపోయిందని, దీనివల్ల రాష్ట్రంపై భవిష్యత్తులో మరింత ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై కేంద్రం మరియు న్యాయ వ్యవస్థ తగిన జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు.