Jagan : జనం బాట పట్టబోతున్న మాజీ సీఎం
Jagan : ఎన్నికలలో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న జగన్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యలపై వ్యూహాత్మకంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నారు
- By Sudheer Published Date - 04:45 PM, Fri - 18 April 25

ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై వరుసగా కేసులు నమోదు కావడంపై పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)తీవ్రంగా స్పందించారు. ఇటీవల పార్టీ కీలక నేతలతో సమావేశమైన జగన్, రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వక్ఫ్ బిల్లు(Waqf Bill)పై కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమూ, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలు ప్రారంభించాలన్న నిర్ణయం కూడా ఇదే దిశలో భాగంగా కనిపిస్తోంది.
Congress : ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా? అంత దమ్ముందా..? – మంత్రి పొంగులేటి
ఎన్నికలలో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న జగన్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యలపై వ్యూహాత్మకంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ రెండో వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రజల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని, కార్యకర్తలతో మమేకమవుతూ ప్రజల మద్దతును తిరిగి సంపాదించుకోవాలన్నది జగన్ వ్యూహం. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకు వెళ్లడం ద్వారా మైనారిటీల మద్దతు కోల్పోకుండా ఉండాలన్న దిశగా కూడా జగన్ అడుగులు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీతో వైసీపీ ఎంపీలు సంపర్కంలోకి వెళ్లిన విషయంపై జగన్ స్పందించకపోయినా, ఆ పార్టీ చేస్తున్న రాజకీయలపై ఆయన అప్రమత్తంగా ఉన్నారు. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిలో భాగమైన బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలను రూపొందించాలన్న భావన జగన్‌లో ఉంది. ప్రస్తుతానికి కేసుల విషయంలో న్యాయపరంగా ఎదుర్కొనడంతో పాటు, త్వరలోనే జిల్లాల పర్యటనల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఈ పర్యటనల ద్వారా ప్రజల మధ్య ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్‌ను తిరిగి బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.