CBN : మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదు – చంద్రబాబు హెచ్చరిక
అసత్య కథనాలు ప్రచారం చేసే పత్రికలు, మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకెళ్లామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు
- By Sudheer Published Date - 11:17 AM, Fri - 12 July 24

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant) విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటూ దక్కన్ క్రానికల్ (Deccan Chronicle) ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైజాగ్ లోని డీసీ ఆఫీస్‌పై దాడి చేశారు. బోర్డును తగులబెట్టారు. దీనిపై వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan). టీడీపీని గుడ్డిగా అనుసరించకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియాను అణిచివేయడానికి టీడీపీ చేసిన మరో ప్రయత్నమని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో ప్రతి రోజూ రాష్ట్రంలో అప్రజాస్వామ్య చర్యలు నమోదవుతున్నాయని, దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు.
ఇలా రోజు రోజుకు విమర్శలు ఎక్కువ అవుతున్న తరుణంలో ఈ ఘటన ఫై సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించారు. అసత్య కథనాలు ప్రచారం చేసే పత్రికలు, మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకెళ్లామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆయా వార్తల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని అంతే తప్ప కార్యాలయాలపై దాడులకు వెళ్లడం సరికాదని, సంయమనం పాటించాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే నంద్యాల జిల్లాలో 3వ తరగతి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడటంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన కలచివేసిందని, ప్రభుత్వం నేరాలను అంగీకరించదని స్పష్టం చేశారు. ‘ఆడబిడ్డల సంరక్షణకు సంస్థాగతంగా మెకానిజం కావాలి. పిల్లలు తప్పులు చేయకుండా తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలి. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో మానవతా విలువలపై సిలబస్ చేర్చుతున్నాం’ అని సీఎం ట్వీట్ చేశారు. నంద్యాల జిల్లా మచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పగిడ్యాలలో 8 ఏళ్ల బాలిక ఆదివారం (జూలై 7) సాయంత్రం కనిపించకుండాపోయింది. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది. బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మచ్చుమర్రి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
గ్రామ శివారులోని ఓ పంప్ హౌస్ వద్ద బాలిక చిరిగిన దుస్తుల భాగం లభించింది. దీంతో స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దించగా.. దుస్తుల వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్.. ఒక బాలుడి నివాసం వద్దకు వెళ్లి ఆగిపోయింది. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు. మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లను కూడా చెప్పాడు. దీంతో పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలికను ముగ్గురు బాలురు బలవంతంగా తీసుకెళ్లారు. గ్రామ శివారులోని పంప్ హౌస్ వద్దకు తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు తమ పేర్లు చెబుతుందేమోనని భయపడి బాలికను హత్య చేసి, కృష్ణా బ్యాక్ వాటర్‌లో మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసులతో మైనర్ బాలురు తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Also : Weather Update: ఇవాళ ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు: ఐఎండీ