Tomato 1 Rupee : అక్కడ కిలో టమాటా 1 రూపాయే.. రైతుల లబోదిబో
Tomato 30 Paisa : టమాటా ధరలు గతంలో ఎంతగా పెరిగాయో.. ఇప్పుడు అంతగా తగ్గిపోయాయి.
- Author : Pasha
Date : 07-10-2023 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
Tomato 1 Rupee : టమాటా ధరలు గతంలో ఎంతగా పెరిగాయో.. ఇప్పుడు అంతగా తగ్గిపోయాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం కిలో టమాటా రిటైల్ ధర రూ.20 దాకా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా ధర నాణ్యతను బట్టి రూ.20 నుంచి రూ.25 దాకా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ లో కిలో టమాటా 1 రూపాయి కంటే తక్కువ రేటే పలుకుతోంది. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్ యార్డులో 50 కిలోల టమాటా బాక్స్ ధర ఎంతో తెలుసా ? కేవలం 50 రూపాయలు. దీంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు టమాటాలను రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తికొండ మార్కెట్ కు వచ్చే టమాటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పత్తికొండ మార్కెట్ లో టమాటాలను కొని ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ధర ఎక్కువగా ఉన్నచోట్ల విక్రయించేలా ప్రణాళికలను రాష్ట్ర సర్కారు అమలు చేయాలని రైతులు సంఘాలు కోరుతున్నాయి. ఒక్క టమాటా కోసమే కాకుండా.. ఇతర పంటలకు కూడా ఈ తరహా వ్యూహాన్ని అనుసరిస్తే ధరలు బాగా తగ్గినప్పుడు రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని అంటున్నాయి.
Also read : India vs Pakistan: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ గణాంకాలు ఇవే.. అలా జరిగితే టీమిండియా గెలుపు కష్టమే..?!
గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.245 కోట్లతో కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ (టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ )ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులంతా టమాటా సాగును పెంచారు.తుంగభద్ర జలాలు అందడంతో సాగు గణనీయంగా పెరిగింది. కర్నూలు జిల్లావ్యాప్తంగా 125 హెక్టార్లలో టమాటా సాగు చేపట్టారు. 2 నెలల క్రితం కిలో టమాటా 200 రూపాయల దాకా చేరడంతో.. అదే రేటు కొనసాగొచ్చనే తప్పుడు అంచనాతో మరింత మంది కూడా టమాటా సాగు వైపు చూపు మళ్లించారు. కానీ టమాటా ధరలు డౌన్ కావడంతో అలాంటి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రకటన చేస్తారని రైతులు ఆశగా ఎదురుచూశారు. అది కూడా జరగలేదు. ఈవిధంగా ఏ రకంగా చూసినా జిల్లాలోని టమాటా రైతులకు నిరాశే మిగిలింది.