Traffic Challan : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా బంద్: ఏపీ హైకోర్టు
ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
- By Latha Suma Published Date - 02:03 PM, Thu - 12 December 24

Traffic Challan : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని.. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత మూడు నెలల్లో ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మృత్యువాత పడ్డారని.. అధికారులు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8, 770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సి ఉండగా.. 1994 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర మోటర్ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.