Pawan Kalyan: నేను విన్నాను.. నేను చూశాను, పంట నష్టంపై పవన్ ఆవేదన!
అకాల వర్షాలతో (Rains) రైతాంగం నష్టాల పాలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
- Author : Balu J
Date : 02-05-2023 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రవ్యాప్తంగా (Andhra Pradesh) కురుస్తున్న అకాల వర్షాలతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే పంట కళ్ల ముందే నీటి పాలు కావడంతో లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడినా గింజ కూడా చేతికి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రియాక్ట్ అయ్యారు. అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని అన్నారు. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోంది అని, వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని పవన్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు.
వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయని, ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని, గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలు ప్రభుత్వం (AP Govt) మీనమేషాలు లెక్కించడంతో రైతలు ఆందోళనలో ఉన్నారని పవన్ అన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందని, ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం
ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన కళ్ళారా చూశానని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారుపడ్డ బాధలు తెలుసుకున్నానని, కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నానని, ప్రకృతి విపత్తుల మూలంగా పంటలు కోల్పోతున్న రైతులను (Farmers) ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని పవన్ అన్నారు.
Also Read: Priyanka Gandhi Tour: హైదరాబాద్ కు ప్రియాంక రాక.. భారీ బహిరంగ సభకు ప్లాన్!