HYD – Amaravati : హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే- త్వరలోనే మార్గం ఖరారు?
HYD - Amaravati : హైదరాబాద్ పరిధిలో ఎక్స్‌ప్రెస్ వే ఎంట్రీ పాయింట్‌ను ORR నుంచి ఇవ్వాలా, లేక భవిష్యత్తులో రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (RRR) నుంచి ఇవ్వాలా అన్న దానిపై ఇంకా తేల్చాల్సి ఉంది
- By Sudheer Published Date - 12:48 PM, Mon - 25 August 25

హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ఈ రహదారి మార్గం (అలైన్‌మెంట్) ఖరారు కావడంలో ఆలస్యం అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ నుంచి ప్రారంభించాలి, ఎక్కడ అనుసంధానం చేయాలి అనే ఎంట్రీ పాయింట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నిర్ణయం తీసుకుంటేనే దీనికి సమాంతరంగా ప్రతిపాదించిన హై-స్పీడ్ రైలు మార్గానికి కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Husband Kills Wife : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం .. భార్యను హత్య చేసి కాల్చిన భర్త
ప్రస్తుతం తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మీదుగా మూడు రకాల ప్రాథమిక రూట్ మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నారు. వీటిని సీఎంలు ఆమోదించిన తర్వాతే కేంద్రానికి సమర్పిస్తారు. ఆ తర్వాతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పనులు ప్రారంభం అవుతాయి. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు విస్తరించి, హై-స్పీడ్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని కోరుతోంది. అంతేకాకుండా మచిలీపట్నం పోర్ట్ వరకు కొత్త రైలు మార్గం మంజూరు చేయాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది.
ఈ రహదారి ప్రాజెక్టు అమలు అయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ఎగుమతులు, దిగుమతులకు కూడా ఇది ఎంతో కీలకం కానుంది. అయితే హైదరాబాద్ పరిధిలో ఎక్స్‌ప్రెస్ వే ఎంట్రీ పాయింట్‌ను ORR నుంచి ఇవ్వాలా, లేక భవిష్యత్తులో రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (RRR) నుంచి ఇవ్వాలా అన్న దానిపై ఇంకా తేల్చాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ నుంచి ఇవ్వాలనుకుంటే ఫ్యూచర్‌సిటీకి దగ్గరగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాలు తేలితేనే ప్రాజెక్టు పనులు వేగం తీసుకోవడం ఖాయం.