Husband Kills Wife : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం .. భార్యను హత్య చేసి కాల్చిన భర్త
Husband Kills Wife : పోలీసులు వెంటనే శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట కుంటిసాకులు చెప్పిన శ్రీశైలం, పోలీసుల గట్టి విచారణతో నేరాన్ని అంగీకరించాడు
- By Sudheer Published Date - 12:32 PM, Mon - 25 August 25

భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు, అక్రమ సంబంధాల కారణంగా రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరిగిన ఘటన మరువక ముందే, నాగర్‌కర్నూల్ జిల్లాలో మరొక దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యను అనుమానంతో చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వారి జీవితం సవ్యంగా సాగినా, ఇటీవల వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో శ్రావణి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 21న శ్రీశైలం తన భార్య దగ్గరకు వెళ్లి, సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్దామని నమ్మబలికి ఆమెను తన బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో శ్రీశైలం ఆమెను పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మాన్ దీన్నే అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి ఆమె శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
Trump Tariffs India : భారత్ పై కావాలనే టారిఫ్స్ పెంచారు – వాన్స్
శ్రీశైలంతో వెళ్లిన తన కూతురు తిరిగి రాకపోవడంతో, శ్రావణి తండ్రి మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట కుంటిసాకులు చెప్పిన శ్రీశైలం, పోలీసుల గట్టి విచారణతో నేరాన్ని అంగీకరించాడు. తానే శ్రావణిని చంపినట్లు అంగీకరించడమే కాకుండా, హత్య చేసిన స్థలాన్ని కూడా చూపించాడు. శ్రావణి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది, కుటుంబ బంధాలు ఎలా క్షీణిస్తున్నాయో మరోసారి తెలియజేసింది.