Vijayawada : బెజవాడలో కిటకిటలాడుతున్న గోల్డ్ షాపులు
ధనత్రయోదశి సందర్భంగా విజయవాడలో బంగారం దుకాణాల్లో రద్దీ నెలకొంది. ధణత్రయోదశి నగల వ్యాపారులకు ముఖ్యమైన
- By Prasad Published Date - 03:46 PM, Sat - 11 November 23
ధనత్రయోదశి సందర్భంగా విజయవాడలో బంగారం దుకాణాల్లో రద్దీ నెలకొంది. ధణత్రయోదశి నగల వ్యాపారులకు ముఖ్యమైన రోజుగా భావిస్తున్నారు. ప్రజలు కూడా ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా శ్రేయస్సు, అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. దీంతో విజయవాడ నగరంలోని బంగారు నగల దుకాణాలు పలు ఆఫర్లు, రాయితీలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. షాపుల యజమానులు కూడా పండుగ వాతావరణం నెలకొల్పేందుకు తమ దుకాణాలను మిరుమిట్లు గొలిపే లైటింగ్, పూల డెకరేషన్‌తో అంగరంగ వైభవంగా అలంకరించారు. ధన త్రయోదశి ఈ రోజు (శనివారం) మధ్యాహ్నాం వరకు కొనసాగుతుండడంతో శనివారం భారీగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. విజయవాడలో అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజుల్లోనే పలు కార్పొరేట్ దుకాణాల్లో వార్షిక విక్రయాలు 15 నుంచి 20 శాతం వరకు జరుగుతున్నట్లు అంచనా. దీపావళి రోజున లక్ష్మీపూజ చేసే సంప్రదాయం దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ పూజ మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. కస్టమర్లను ఆకర్షించేందుకు షాపులు ప్రత్యేకంగా వజ్రాభరణాలపై ఆకట్టుకునే ఆఫర్లు, ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. దీంతో వినియోగదారుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మొత్తమ్మీద, ధనత్రయోదశిని పురస్కరించుకుని ప్రజలు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో బంగారం దుకాణాలకు సందడి నెలకొంది.